● పట్టించుకోని రెవెన్యూ అధికారులు
● ప్రభుత్వ భూముల ఆక్రమణపై స్థానికుల ఆగ్రహం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె నవోదయ కాలనీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నకిలీ పట్టాలతో రాత్రికి రాత్రే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక వీఆర్వోల పాత్రపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలను రాత్రివేళల్లో ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. అదేవిధంగా పేదల ఇళ్ల మధ్యలో కొందరు బడా వ్యక్తులు ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా భవంతులు నిర్మిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆక్రమణలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు స్పందించి వలసపల్లె నవోదయ కాలనీలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేసి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


