మదనపల్లె టౌన్ : ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితుడిని మదనపల్లె వన్‌న్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అరెస్టుకు సంబంధించి మదనపల్లి వన్ టౌన్ సీఐ రాజారెడ్డి బుధవారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం దండువారిపల్లెకు చెందిన పూజారి మహేష్ (26)ను అమ్మచెరువుమిట్ట వద్ద వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అప్పుల కారణంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 12.150 గ్రాముల బంగారు చైన్, 19 గ్రాముల వన్‌న్‌గ్రామ్ గోల్డ్ చైన్, చైన్లు విక్రయించడం ద్వారా వచ్చిన రూ.1.90 లక్షల నగదు, నేరాలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మదనపల్లె వన్‌న్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు చైన్ స్నాచింగ్ కేసులు, బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కేసులో మహేష్ ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. మదనపల్లె పట్టణంలోని జోగప్పగారి వీధి, పీ అండ్ టీ కాలనీ, బి.కొత్తకోట పరిధిలోని బురకాయలకోట ప్రాంతాల్లో మహిళల నుంచి చైన్లు లాక్కెళ్లిన ఘటనల్లో నిందితుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


