మదనపల్లె టౌన్ : వ్యక్తిగత పని కోసం మదనపల్లెకు వచ్చిన ఆ యువకుడు తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో భార్య, పిల్లలు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా నవ్వులపూల కుంటకు చెందిన నవీన్ కుమార్ (38) ద్విచక్ర వాహనంపై మదనపల్లెకు వచ్చాడు. పని ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ నెల 14న కురబలకోట మండలం, దొమ్మన్న బావి వద్ద అతని ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే నవీన్ కుమార్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు అతడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై ముదివేడు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


