ఒంటిమిట్ట : మండల పరిధి రాచగుడిపల్లిలోని దళితవాడకు చెందిన బల్లి శేఖర్ అనే దళితుడి ఇంటిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులాలకు చెందిన టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ విషయమై మాల మహానాడు సంఘం నాయకులు బాధితుడితో కలిసి మంగళవారం ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాచగుడిపల్లిలోని 148 సర్వే నంబర్‌లో 23 సెంట్ల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నల్లగొండు సుబ్బారెడ్డి ఆక్రమించి, అందులో ఇప్పటికే కాంపౌండ్ వాల్ నిర్మించి, ఫామ్ హౌస్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడని రాచగుడిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో బల్లి శేఖర్ అనే దళితుడు తన ఇంటి వద్ద ఒంటిమిట్ట తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందించేందుకు కొంత మంది గ్రామస్తులతో సంతకాలను సేకరిస్తున్న నేపథ్యంలో, టీడీపీ నాయకుడు నల్లగొండు వెంకట సుబ్బారెడ్డి, అతని భార్య(మాజీ ఎంపీపీ) నల్లగొండు లక్ష్మీదేవి, వారి బావమరిది ఆరెమ్ జస్వంత్, వారి డ్రైవర్ సునీల్, సాకే హరి అతని ఇంటిపైకి ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


