గుర్రంకొండ : మండల పరిధి తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహాస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. మంగళవారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మదినం కావడంతో టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయంలో స్వామివారి కల్యాణ మండపం వద్ద చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. పంచామృతాలతో మూలవర్లకు అభిషేకాలు కావించారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు ఆకట్టుకుంది. ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ఎదుట యజ్ఞహోమాలు నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.


