మదనపల్లె టౌన్ : మదనపల్లెలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన సోమవారం రాత్రి కలకలం రేపింది. బసినికొండకు చెందిన హరీష్ (25)ను సయ్యద్, గణేష్.. మాట్లాడే పని ఉందంటూ స్థానిక ఆస్పత్రి సమీపానికి పిలిపించినట్లు సమాచారం. అక్కడ ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో సయ్యద్, గణేష్ హరీష్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే హరీష్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దాడి కేసులో వ్యక్తికి జైలు శిక్ష
సంబేపల్లె : వృద్ధుడిపై దాడి చేసిన కేసులో కె.పాపయ్య అనే వ్యక్తికి రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి సుయోధన ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు రూ. 5000 జరిమానా విధించినట్లు మంగళవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల మేరకు.. మండల పరిధిలోని శెట్టిపల్లె గ్రామ పంచాయతీ కడియాల వాండ్లపల్లెకు చెందిన ఎం.నారాయణ తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన పాపయ్యకు కౌలుకు ఇచ్చాడు. పాపాయ్య కౌలు గడువు లోపల చెల్లించలేదు. తనకు కౌలు డబ్బులు చెల్లించాలని నారాయణ అడిగినందుకు పాపయ్య ఆగ్రహించి వృద్ధుడైన నారాయణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు 2018లో అప్పటి సంబేపల్లె ఎస్‌ఐ హాసం కేసు నమోదు చేశారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లీ హర్షం వ్యక్తం చేశారు.
ముగిసిన పవిత్రోత్సవాలు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 11న అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. మూడు రోజులుగా యాగశాలలో వేదపండితులు హోమాలు నిర్వహించారు. చివరిరోజు సోమవారం విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర దేవతా హోమం, శాంతి హోమం, మహా పుర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణ, మహా మంగళహారతి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.


