మదనపల్లె టౌన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. మదనపల్లె ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోళ్లబైలు–2 వెంకటేశ్వరపురం కాలనీకి చెందిన మణికంఠ (25) సోమవారం రాత్రి బైక్‌పై రింగ్ రోడ్డుకు వెళుతుండగా, మార్గంమధ్యలోని చౌడేశ్వరి కల్యాణ మండపం సమీపంలోని డాబా వద్ద బసినికొండకు చెందిన బాలకృష్ణ, లీలావతి దంపతులు వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడగా, స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మణికంఠ పరిస్థితి విషమంగా ఉండటంతో రుయాకు రెఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
లారీ ఢీకొని..
మదనపల్లె ప్రాంతంలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో మామ, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం, గౌనిపల్లి సమీపంలోని మొటుకు పంచాయతీ చిన్నపల్లికి చెందిన శివశంకర్ (40), అదే ఊరికి చెందిన అతని బావమరిది పరమేష్ (20) సోమవారం సాయంత్రం బైక్ పై బోయకొండకు సొంత పని మీద వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గంమధ్యలోని మదనపల్లె బసినికొండ బైపాస్ రోడ్డు, పాత ఆర్టీఓ ఆఫీసు వద్ద ఐచర్ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటు ఉన్నారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని..
కురబలకోట మండలం దొమ్మన్నబావి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నంబులపూలకుంటకు చెందిన నవీన్‌కుమార్(38) స్కూటర్‌పై మదనపల్లెకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుటుంబీకులు వచ్చి బాధితున్ని వెంటనే బెంగుళూరుకు తరలించారు. ముదివేడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తుపన్నట్లు తెలిపారు.


