రాయచోటి టౌన్ : రాయచోటి కోర్టులో రాయచోటి బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం విధులు బహిష్కరించారు. అనంతరం రాయచోటి కోర్టు గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు యండపల్లె రమేష్‌రెడ్డి మా ట్లాడుతూ ఈ నెల 8వ తేది రాత్రి 9 గంటల సమయంలో బంగ్లా సర్కిల్ వద్ద న్యాయవాదులు అయిన రవిశంకర్, గణేష్‌పై ట్రాఫిక్ హోంగార్డు సిద్దయ్య, ట్రాఫిక్ సీఐ పెంచలయ్య దుర్భాషలాడటంతోపాటు తప్పుడు కేసు లు బనాయించారని ఆరోపించారు. తరచూ న్యాయవాదులపై పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమాజంలో న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్య పౌరుడికి ఎలాంటి రక్షణ కల్పిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పగడాల శ్రీనివాసులు, సీనియర్ న్యాయవా ది శ్రీనివాసుల రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, బాలాజీరెడ్డి, నాగమల్లు, చిన్నచెడ్డెప్పరెడ్డి, రామాంజనేయులు, వెంకటేష్, వెంకటేశ్వర్లు, ఇలియాస్ బాష, నాగరాజ, పవనేష్‌రెడ్డి, పవన్ కళ్యాణ్, రాంకుమార్, నాగేశ్వరావు, రమేష్, రాజేష్, కవితలు పాల్గొన్నారు.
సోషల్ మీడియా వేదికగా పోలీసులు
న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు తెలియడంతో రాయచోటి పోలీస్ అధికారులు సంఘటన జరిగిన రోజు చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించడం మొదలు పెట్టారు. అలాగే న్యాయవాదులపై నమోదు అయిన ఎఫ్‌ఐఆర్ పత్రాలను సైతం సోషల్ మీడియా (వాట్సాప్) ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే గతంలో ఎలాంటి కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ చేయని పోలీసు అధికారులు.. ఇప్పుడు మాత్రమే ఇలా చేయడంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు.


