సాక్షి, మదనపల్లె : మదనపల్లె మండలం బొమ్మనచెరువు గ్రామానికి సంబంధించిన పది పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు వినతిపత్రం ద్వారా అభ్యంతరం తెలియజేశారు. పది పోలింగ్ కేంద్రాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం వల్ల ఎన్నికల రోజు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ పాఠశాలకు చిన్న ప్రవేశ ద్వారం ఉండటం, ఓటర్లు ఒకే సారి పెద్ద సంఖ్యలో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు, రాకపోకలకు అంతరాయం, క్యూలైన్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఇబ్బందులు తప్పవని, దీన్ని పరిశీలించి సరైన చర్యలు తీసుకోవాలని జేసీని కోరినట్టు చెప్పారు. కేంద్రాలను విడగొట్టి కొన్నింటిని బొమ్మనచెరువు ఓటర్లకు మందబండ గ్రామంలో ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. ఇక్కడ స్కూల్ భవనం, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం వినియోగించుకోవాలని కోరామన్నారు. దీనిపై జేసీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆయన వెంట ఎంపీటీసీ కదిరిపతి, నాయకులు విఎస్.రెడ్డి, యూనస్, గ్రానైట్ మహేశ్, నవాజ్ అలీఖాన్, సాధిక్, షేక్ జబి, యాసిన్, గ్రామస్తులు రమణ, ఎల్లుట్ల గణేష్, అమర పాల్గొన్నారు.
జేసీకి నిసార్ అహ్మద్ ఫిర్యాదు


