● అగ్నిప్రమాదంలో కట్టెలు దగ్ధం
● రూ.50 వేల నష్టం
కురబలకోట : టమాటా మార్కెట్ వద్ద ఉన్న వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు కాస్తా పక్కనే ఉన్న కుమ్మరి మహిళ ఇంటి వరకు వ్యాపించి జరిగిన అగ్ని ప్రమాదం వ్యథను మిగిల్చింది. మట్టి కుండలను కాల్చడానికి సిద్ధం చేసిన కట్టెలు అగ్నికి కాలిపోయాయి. బాధితురాలు మంగళవారం తెలిపిన కథనం మేరకు.. కురబలకోట మండలం అంగళ్లులోని టెర్రకోట నగర్‌లో హైవే పక్కన దుర్గం గౌతమి టెర్రకోట కుండలు, బొమ్మలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారింటి వెనుక బాగంలో అంగళ్లు టమాటా మండీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చెత్తా చెదారంతోపాటు వ్యర్థాలు కూడా ఉండడంతో ఇటీవల నిప్పుపెట్టారు. ఆ సమయంలో గౌతమి కుటుంబీకులు ఎవ్వరు ఇంటి వద్ద లేక మంటల వ్యాపించిన విషయం గుర్తించలేకపోయారు. దీంతో మంటలు ఇంటి సమీపానికి విస్తరించి కుండలు కాల్చేందుకు రూ.50 వేలతో కొనుగోలు చేసి నిల్వ ఉంచిన కట్టెలకు అంటుకున్నాయి. కష్టార్జితంతో కొన్న కట్టెలన్నీ కాలిపోవడంతో ఆర్థిక నష్టం వాటిల్లిందని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రావడంతో ఇల్లు కాలిపోకుండా ప్రమాదం తప్పింది. చేతి కష్టంతో బతుకుతున్న తనకు తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.


