అత్తా కోడళ్ల పై విచక్షణా రహితంగా దాడి | - | Sakshi
Sakshi News home page

అత్తా కోడళ్ల పై విచక్షణా రహితంగా దాడి

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్‌) : పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు ఒంటరిగా ఉన్న అత్తాకోడళ్లపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శుక్రవారం జరిగిన ఘటనపై బాధితులు నిమ్మనపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ, దిన్నిమీద జంగంపల్లికి చెందిన రవణమ్మ, మంజుల కుటుంబానికి, అదే ఊరికి చెందిన శ్రీనివాసులు తిరుమలేశు కుటుంబానికి బోరు వద్ద వివాదం నడుస్తోంది. పాతకక్షలను మనసులో పెట్టుకున్న ప్రత్యర్థులు అత్తాకోడళ్లు బోరు వద్ద ఉండడాన్ని గుర్తించి కళ్లలో కారం చల్లి విచక్షణారహితంగా చితకబాదారు. అనంతరం అక్కడి నుంచి దాడికి పాల్పడ్డ వారు పారిపోవడంతో ఆలస్యంగా చేరుకున్న బాధితులు కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం నిమ్మనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పిన బైక్‌

కింద పడి వృద్ధుడి మృతి

మైదుకూరు : మైదుకూరు మండలం మూడుమాండ్లు గ్రామం వద్ద బళ్లారి – కృష్ణపట్నం జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి బైక్‌పై నుంచి కిందపడి కొడదల నరసింహులు(70) మృతి చెందినట్లు మైదుకూరు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ జిల్లా పానగల్లు గ్రామానికి చెందిన నరసింహులు, అతని కవల కుమారులు రాము, లక్ష్మణ్‌.. బ్రహ్మంసాగర్‌ నుంచి కడప సమీపంలోని కొప్పర్తి ఇండస్ట్రీయల్‌ ఏరియాకు నీటి సరఫరా కోసం జరిగే పైపులైన్‌ పనులు చేస్తున్నారు. పైపులైన్‌ పనులు జరుగుతున్న నందిపల్లె వద్ద నుంచి వారి నివాసం ఉంటున్న మైదుకూరు ప్రాంతంలోని జీవీ సత్రంకు గురువారం సాయంత్రం బైక్‌లపై తిరిగి వస్తున్నారు. మూడుమాండ్ల వద్ద నరసింహులు బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో అదుపు చేయలేక బైక్‌పై నుంచి కింద పడ్డాడు. తలకు రక్తగాయాలు అయ్యాయి. అతన్ని సమీపంలోని జీవీ సత్రం పీహెచ్‌సీకి తరలించగా చనిపోయినట్టు అక్కడి డాక్టర్‌ నిర్ధారించారు. కుమారుడు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చోరీ కేసులో

నిందితుడి అరెస్ట్‌

చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని అంగడి వీధిలో జూన్‌ 14వ తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితుడు ముసలిగాళ్ళ వంశీని శుక్రవారం అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుండి 57 గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. అంగడివీధికి చెందిన కొండికళ్ళు వరలక్ష్మి అనే మహిళ జూన్‌ 14వ తేదీ ఉదయం ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి మెయిన్‌ డోర్‌ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువా పైన ఉన్న తాళాల సహాయంతో బీరువాను తెరిచి, అందులోని బంగారు వస్తువులు దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజుపాలెం మండలంలోని పర్లపాడుకు చెందిన వంశీని రిమ్స్‌ – ఉటుకూరు మెయిన్‌ రోడ్‌ లోని చైతన్య స్కూల్‌ సర్కిల్‌ సమీపంలోని టీ షాప్‌ వద్ద శుక్రవారం అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుండి రెండు బంగారు గాజులు, ఒక సాదా చైను, ఒక ఉంగరం కలిపి మొత్తం సుమారు 57 గ్రాములు బరువు గల బంగారు వస్తువులను స్వాధీన పరచుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌ కోసం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement