మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని ఎరపువారిపల్లెలో భూ వివాదాలు, పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. భూ వివాదం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం కరల్రు, రాళ్లతో దాడులకు పాల్పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రప్ప, నరేష్, సురేష్ వర్గాల మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాత్రి ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. చంద్రప్ప వర్గీయులు నరేష్, సురేష్‌పై మూకుమ్మడిగా దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. ప్రతి దాడిలో చంద్రప్ప భార్య నాగవేణి సైతం గాయపడినట్లు తెలిపారు. గాయపడిన ముగ్గురినీ కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలోని వైద్యులు వారికి చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూ వివాదం, పాత కక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారణ అనంతరం వెల్లడించాల్సి ఉంది.
భూ వివాదం నేపథ్యంలో
ఇరువర్గాల ఘర్షణ
ముగ్గురికి గాయాలు


