● కాలిన స్థితిలో గుర్తింపు
● మనిషిని చంపి కాల్చారని అనుమానాలు?
రాయచోటి (చిన్నమండెం) : చిన్నమండెం మండలం, వండాడి గ్రామ పరిధిలోని గుట్టల సమీపంలో గుర్తు తెలియని కాలిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం ఉదయం గుట్టల సమీపంలో విడిభాగాలై పూర్తిగా కాలని శవం కనిపించగా.. స్థానికులు విషయాన్ని చిన్నమండెం పోలీసులకు చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విడి భాగాలుగా ఉన్న శవం ముద్దలకు పంచనామా నిర్వహించేందుకు వైద్యులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎందుకు చంపారన్న విషయం తెలియాల్సి ఉంది.
దేవగుడిపల్లి వృద్దురాలిగా..?
చిన్నమండెం మండలం, దేవగుడిపల్లి గ్రామానికి చెందిన ఎనభై ఏళ్ల వృద్ధురాలు నాలుగురోజుల క్రితం నుంచి కనిపించడం లేదు. వృద్ధురాలికి భర్త, పిల్లలు ఎవ రూ లేకపోవడంతో ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఆమె మెడలో విలువైన బంగారు గొలుసు, కమ్మలు, ఉంగరాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గత శుక్రవారం నుంచి ఆమె కనిపించలేదని ఆదివారం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ దశలో బుధవారం గుర్తు తెలియని రీతిలో మృతదేహం లభించడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారు ఆభరణాల అపహరణకోసం ఆమెను చంపి ఇలా చేశారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.


