● మూడు రోజుల్లోనే
8,175 దరఖాస్తులు నమోదు
● వృద్ధాప్య పింఛన్లకే అత్యధిక ప్రాధాన్యత
● మదనపల్లి రూరల్ 674
దరఖాస్తులతో టాప్
● వివరాలు వెల్లడించిన
జిల్లా అధికారి అమరనాథరెడ్డి
మదనపల్లి/(కురబలకోట): పింఛన్ అంటే కేవలం డబ్బు కాదు.. వృద్ధులకు, నిస్సహాయులకు కొండంత ఆసరా.. వారి బతుక్కు అసలైన భరోసా! కన్నబిడ్డలే కళ్లెదుట కాదనుకుంటున్న ప్రస్తుత రోజుల్లో, పింఛన్ వస్తే ఎవరి మీదా ఆధారపడకుండా, ఎవరి వైపూ చేయి చాచకుండా ఆత్మగౌరవంతో బతకవచ్చని వేలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కొత్త పింఛన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో.. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వేలాది కళ్లు ఆత్రుతతో సచివాలయాల వైపు చూస్తున్నాయి. ఒక్కో దరఖాస్తు వెనుక ఒక్కో నిస్సహాయత, వర్ణించలేని కష్టం, కన్నీటి వేదన దాగి ఉన్నాయి.
కిటకిటలాడిన సచివాలయాలు..
సర్వర్ మొరాయింపు! జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు పింఛన్ దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే, బుధవారం మధ్యాహ్నం నుంచి అకస్మాత్తుగా సర్వర్ డౌన్ కావడంతో ఆన్‌లైన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో వచ్చిన వృద్ధులు, నిస్సహాయులు నిట్టూరుస్తూ వెనుదిరగాల్సి వచ్చింది. మూడు రోజులుగా ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, బుధవారం సాయంత్రం నాటికి జిల్లాలో మొత్తం 8,175 కొత్త పింఛన్ దరఖాస్తులు నమోదైనట్లు ‘స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ’ అన్నమయ్య జిల్లా అధికారి అమరనాథరెడ్డి నివేదికల ద్వారా వెల్లడించారు.
పారదర్శకత ప్రభుత్వ బాధ్యత
వయసు మీదపడి కొందరు, జీవిత భాగస్వామిని కోల్పోయి కొందరు, దివ్యాంగత్వంతో మరికొందరు, ఒంటరి మహిళలుగా ఇంకొందరు జీవిత పోరాటం చేస్తూ ఎంతో ఆశగా పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. పింఛన్ అనేది నిస్సహాయుల హక్కు అని, దానిని పారదర్శకంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అని లబ్ధిదారులు కోరుతున్నారు.


