మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 11 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు డీజీపీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన సిబ్బంది బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి, అడిషనల్ ఎస్పీలను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పదోన్నతి పొందిన వారిలో మహ్మద్ బాష, ఇబ్రహీం, శేఖర్, హరికృష్ణ, వాసు, ముత్యాలయ్య, రాంప్రసాద్, నాగేశ్వర్ నాయక్, హరి, శంకర తదితరులు ఉన్నారు.
రోగులకు మెరుగైన
వైద్య సేవలందివ్వాలి
కలికిరి: ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలందించాలని అన్నమయ్య జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ అధికారి (డీపీఎంఓ) డాక్టర్ రమేష్ కోరారు. మండలంలోని మేడికుర్తి పీహెచ్‌సీని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది హాజరు రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కావ్యగంధ, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, హెచ్‌ఎస్ సుధాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రొంపిచెర్లలో
36.8 మి.మీ. వర్షపాతం
రొంపిచెర్ల: మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఐదు నెలలుగా వర్షాలు లేకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు పూర్తిస్థాయిలో వేరుశనగ సాగు చేయలేకపోయారు. బోర్ల కింద సాగు చేసిన కొద్దిపాటి పంట కూడా గత 20 రోజులుగా కాస్తున్న తీవ్రమైన ఎండలకు ఎండిపోయే స్థితికి చేరింది. ఈ తరుణంలో కురిసిన వర్షం పంటలకు జీవం పోయడంతో రైతులకు పెద్ద ఊరట లభించింది. అయితే, ఉరుముల కారణంగా మండలంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు.


