● 21 పతకాలతో అదరగొట్టిన జిల్లా పోలీసులు
● టెన్నిస్‌లో రన్నరప్‌గా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె టౌన్ : రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు సత్తా చాటారు. వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏకంగా 21 పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో చాటారు. ఇందులో 7 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు ఉండటం విశేషం. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 పోటీల్లో కర్నూలు రేంజ్ తరఫున అన్నమయ్య జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించి పతకాల పంట పండించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ అధికారులు, సిబ్బంది మంగళవారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాద పూర్వకంగా కలిశారు. విజేతలను ఎస్పీ అభినందించి, పతకాలతో సత్కరించారు.
టెన్నిస్‌లో ఎస్పీ రన్నరప్
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా టెన్నిస్ డబుల్స్ విభాగంలో పాల్గొని అద్భుత ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించారు. పోలీస్ విధులతోపాటు క్రీడల్లోనూ ఎస్పీ స్వయంగా పాల్గొని సిబ్బందికి స్ఫూర్తిగా నిలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా విభాగంలో డబ్ల్యూపీసీ పి.శశికళ ఏకంగా ఏడు పతకాలు సాధించి అద్వితీయ ప్రతిభ కనబరిచారు. బాక్సింగ్, హ్యాండ్ రెజ్లింగ్‌లో స్వర్ణాలు, షటిల్, బాస్కెట్‌బాల్‌లో రజతాలు, హ్యాండ్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్‌లో కాంస్య పతకాలు సాధించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో సీపీసీ బి.కేశవ్ ఆర్మ్ రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించగా, సీపీసీ ఎం.నాగేంద్ర నాయక్ షాట్‌పుట్, జావెలిన్ త్రోలో రెండు రజత పతకాలు సాధించారు. సీపీసీ సి.జగదీష్ రెజ్లింగ్‌లో రజతం, గ్రీకో రోమన్ విభాగంలో కాంస్యం సాధించారు. ఏపీఆర్పీసి ఇ.శ్రీనునాయక్ హైజంప్‌లో, ఏపీఆర్పీసి కె.సంతోష్ డిస్కస్ త్రోలో కాంస్య పతకాలు సాధించారు. టీమ్ గేమ్స్‌లోనూ అన్నమయ్య జిల్లా పోలీసులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. హ్యాండ్‌బాల్‌లో స్వర్ణ పతకం, హాకీలో రజతం, ఫుట్‌బాల్‌లో రజతం సాధించారు.
క్రీడలతో ఒత్తిడి దూరం
ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. పోలీస్ వృత్తి నిరంతర ఒత్తిడితో కూడుకున్నదని, క్రీడల ద్వారా ఆ ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించవచ్చని అన్నారు. క్రీడలు మానసిక ప్రశాంతతతోపాటు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని, విధి నిర్వహణతోపాటు సిబ్బంది క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు 21 పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో క్రీడల్లో రాణించే ప్రతిభావంతులైన పోలీస్ సిబ్బందిని శాఖ తరఫున మరింతగా ప్రోత్సహిస్తామని ఎస్పీ తెలిపారు. ఒకే పోటీల్లో 21 పతకాలు సాధించి అన్నమయ్య జిల్లా పోలీసులు తమ క్రీడా ప్రతిభను చాటడం పోలీస్ శాఖలో నూతన ఉత్సాహాన్ని నింపింది.


