ఉలవా లేదు.. పలుకూ లేదు! | - | Sakshi
Sakshi News home page

ఉలవా లేదు.. పలుకూ లేదు!

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

ముగిసిన వేరుశనగ సాగు గడువు..

సబ్సిడీ ఉలవల కోసం ఆర్బీకేల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

28,256 హెక్టార్లలో నిలిచిన సాగు!

గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో ఉలవ పంట సాగుకు అదను దాటుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వేరుశనగ సాగు అదను దాటిన తర్వాత, ప్రత్యామ్నాయంగా ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఉలవ వంటి ఆరుతడి పంటల సాగుకు అత్యంత అనుకూలమైన సమయం. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వేరుశనగ సాగుపోను మిగిలిన 28,256 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు ఉలవ పంట సాగు చేసుకోవడానికి పొలాలను మళ్లీ దుక్కులు చేసుకుంటూ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

ఎల్‌నినో దెబ్బకు వేరుశనగ విలవిల..

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పంటల సాగు బాగా దెబ్బతింది. సాధారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 30 నుంచి 35 శాతం మేరకు వేరుశనగ పంట సాగు అవుతుంది. కానీ, ఈ ఏడాది సాగుకు అత్యంత కీలకమైన సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో సగటున కేవలం 14 శాతం మేరకే వేరుశనగ సాగైంది. మిగిలిన రైతులంతా గడువు ముగిసిపోవడంతో తీవ్ర నిరాశతో ప్రత్యామ్నాయంగా, అతి తక్కువ ఖర్చుతో చేతికందే ఉలవ పంట సాగుపైనే ఆశలు పెట్టుకున్నారు. గత పది రోజులుగా రైతులు అరకొర వర్షాలకే పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.

సబ్సిడీ ఉలవల కోసం అధికారుల ప్రతిపాదనలు..

ఖరీఫ్‌ సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన ఉలవల స్టాకు కోసం వ్యవసాయ శాఖ అధికారులు తాజాగా ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదనలు పంపారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎంతమేరకు విత్తనాలు అవసరమో మండలస్థాయి అధికారులు సేకరించి, జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. ప్రభుత్వం నుంచి ఉలవల స్టాకు రాగానే రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.అయితే, ఇప్పటివరకు ఈ సబ్సిడీ ఉలవలు రైతు సేవా కేంద్రాలకు చేరకపోవడంతో రైతులు ప్రతిరోజు విత్తనాల కోసం వ్యవసాయ సిబ్బంది వద్దకు వెళ్లి వాకబు చేస్తూ తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు.

కాస్త ఆలస్యమైనా కాలం చెల్లు

వ్యవసాయాన్ని పండుగ చేస్తామంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన కూటమి నేతలు, తీరా సాగు సమయం ముంచుకొస్తున్నా సబ్సిడీ విత్తనాల ఊసే ఎత్తకపోవడంపై రైతాంగం నిప్పులు చెరుగుతోంది. ఇంకొద్ది రోజులు ఆలస్యమైతే ఉలవ పంట సాగుకు కూడా కాలం చెల్లిపోతుందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన సబ్సిడీ ఉలవలను పంపిణీ చేయాలని జిల్లా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement