హడాఉడాగా జీవో ! | - | Sakshi
Sakshi News home page

హడాఉడాగా జీవో !

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

ముగిసిన పీకేఎం ఉడా చరిత్ర

25 మండలాలు, 4 పురపాలికలతో నూతన అథారిటీ

అధికారికంగా ఉత్తర్వులు

జారీ చేసిన ప్రభుత్వం

విస్తీర్ణం 5,329 చదరపు

కిలోమీటర్లు

సంస్థ రద్దుతో ఊడిన

సురేష్‌ బాబు చైర్మన్‌ పదవి?

బోర్డు మార్పునకు కసరత్తు!

కొత్త చైర్మన్‌ పేరు ప్రకటించని సర్కార్‌

వైస్‌ చైర్మన్‌గా జేసీకి పూర్తి బాధ్యతలు

సాక్షి,మదనపల్లె: జిల్లాకు సంబంధించిన కీలకమైన పట్టణాభివృద్ధి సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూటమి ప్రభుత్వం అత్యంత హడావుడిగా ముగించేసింది. కొత్త చైర్మన్‌ ఎవరో ప్రకటించకుండా, కనీసం పాత చైర్మన్‌ పదవీకాలంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే.. పాత సంస్థను రద్దు చేస్తూ రాత్రికి రాత్రే కొత్త అథారిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడం జిల్లా రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నమయ్య జిల్లావ్యాప్తంగా సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న పుంగనూరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థను రద్దు చేస్తూ, దాని స్థానంలో సరికొత్తగా అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం మున్సిపల్‌ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేష్‌ కుమార్‌ ఈ మేరకు అధికారిక జీవోను విడుదల చేశారు. ఈ నెల 11న సాక్షి దినపత్రికలో ‘అయ్యో.. దే‘ఉడా’! శీర్షికన అన్నమయ్య ఉడా ఏర్పాటు కాబోతోందంటూ ప్రచురితమైన ముందస్తు కథనం అక్షరాలా నిజమైంది.

నూతన అథారిటీ పరిధి ఇదీ

కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య ఉడా పరిధిలోకి జిల్లాలోని ప్రధాన ప్రాంతాలను చేర్చారు.

పురపాలికలు: మదనపల్లె, పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటీలతో పాటు బి.కొత్తకోట నగర పంచాయతీ.

మండలాలు – గ్రామాలు: రాయచోటి నియోజకవర్గంలోని 6 మండలాలు, పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాలు, పాత పీకేఎం ఉడా పరిధిలోని 12 మండలాలతో పాటు చిత్తూరు అథారిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ మొత్తం 25 రెవెన్యూ మండలాలు దీని కిందకు వస్తాయి.

మొత్తం విస్తీర్ణం: నూతన అథారిటీ 5,329.45 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది.

జేసీకి అన్నమయ్య ఉడా బాధ్యతలు

అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సోమవారం నుంచే అధికారికంగా మనుగడలోకి వచ్చినప్పటికీ.. దీనికి నూతన చైర్మన్‌ ఎవరు అన్నది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. రాజకీయ నియామకంపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోవడంతో ఈ అథారిటీకి సంబంధించిన పరిపాలనా వ్యవహారాలన్నింటినీ వైస్‌ చైర్మన్‌ హోదాలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు.

కార్యాలయం ఒక్కటే.. బోర్డు మారనుంది!

ప్రస్తుతం మదనపల్లెలోని పంచాయతీరాజ్‌ ప్రాంగణంలో కొనసాగుతున్న పాత పీకేఎం ఉడా కా ర్యాలయమే ఇకపై అన్నమయ్య ఉడా ముఖ్య కా ర్యాలయంగా కొనసాగనుంది. అధికారులు త్వరలోనే పాత బోర్డును మార్చేసి కొత్త అథారిటీ బో ర్డును ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున రికార్డుల బదలాయింపు జరగనుంది. పాత సంస్థ పరిధిలోని కుప్పం, పలమనేరు మున్సిపాలిటీలు, 12 మండలాలకు చెందిన రికార్డులను చిత్తూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి అప్పగించనున్నారు. అదే సమయంలో కడప అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ఉన్న రాయచోటి మున్సిపాలిటీ, ఆరు మండలాలకు చెందిన ఫైళ్లు అన్నమయ్య ఉడాకు రానున్నాయి. అలాగే గతంలో చిత్తూరు అథారిటీ పరిధిలో ఉండిపోయిన మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల మండలాల రికార్డులను కూడా చిత్తూరు నుంచి అన్నమయ్య ఉడాకు పూర్తిగా బదిలీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement