అర్హులకు న్యాయం చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

అర్హులకు న్యాయం చేయాలని ధర్నా

Aug 13 2026 1:09 AM | Updated on Aug 13 2026 1:09 AM

అర్హులకు న్యాయం చేయాలని ధర్నా

అధికారుల పనితీరుకు అద్దం పడుతున్న ‘రామక్క’ ఉదంతం

ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు

దళారుల డీలింగ్‌

లబ్ధిదారుల లిస్టులో చనిపోయిన వారి పేర్లు

సిక్స్‌ స్టెప్‌ వ్యాలిడేషన్‌ పేరిట

అర్హుల నెత్తిన ‘వడపోత’ పోటు

మగ్గాలు లేకపోయినా

కూటమి తమ్ముళ్లకు లబ్ధి

మదనపల్లె (కురబలకోట): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించిన ‘నేతన్న సేవ’ పథకం ఆచరణలో పూర్తిగా అభాసుపాలైంది. జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నల అకౌంట్లలో రూ.25 వేల చొప్పున జమ చేశామని గొప్పలు చెప్పుకున్న కూటమి ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో మాత్రం నిజమైన కార్మికులను దారుణంగా ముంచేసింది. నిబంధనల వడపోత పేరిట అహోరాత్రులు మగ్గంపై కష్టపడి బట్టనేసే నిజమైన చేనేత కార్మికులకు తీవ్ర మొండిచేయి చూపి, పారదర్శకతకు పాతర వేశారు. అన్నమయ్య జిల్లావ్యాప్తంగా దాదాపు 5,069 మంది అర్హులైన చేనేత కార్మికుల పేర్లతో కూడిన ప్రతిపాదనలను క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వానికి పంపగా, కేవలం 3,869 కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూర్చింది. వేల సంఖ్యలో మగ్గాలున్న చేనేత హబ్‌ మదనపల్లె పట్టణంలో సైతం కేవలం 2,756 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చి మిగిలిన వారి పొట్టగొట్టారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ కడుపు మండిన నేతన్నలు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ముట్టడించారు.

‘నీకింత.. నాకెంత’.. ముడుపుల పర్వం

ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో దళారులు, అధికార పార్టీ ముఠాలు ‘నీకింత.. నాకెంత’ అనే డీలింగ్‌ కింద అక్రమాలకు పాల్పడినట్లు క్షేత్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన అర్హులైన నేతన్నలను పథకం నుంచి దారుణంగా తొలగించి, ఆఖరి నిమిషంలో ముడుపులు ఇచ్చిన అనర్హుల పేర్లను చేనేత సేవ లిస్టులో చేర్చారు. ఒక్కో అనర్హుడి నుంచి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు దళారులు లంచాల రూపంలో వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మగ్గం మీద కూర్చుని నూలు పోగులను పేర్చే నేతన్నకు అర్హతల వడపోత పేరిట మొండిచేయి చూపిన అధికారులు, చేనేత వృత్తితో కనీస సంబంధం లేని వారికి రూ.25 వేల ప్రభుత్వ నిధులను దోచిపెట్టారు.

కొర్రీల ముసుగులో కోతలు..

చనిపోయిన వారికీ లబ్ధి!

నిజమైన అర్హులను తొలగించేందుకు ప్రభుత్వం ‘సిక్స్‌ స్టెప్‌ వ్యాలిడేషన్‌’ (ఆరు అంచెల వడపోత) పేరిట విచిత్రమైన కొర్రీలను తెరపైకి తెచ్చింది. 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి ఉందని, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇల్లు ఉందని, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వాడుతున్నారని, నాలుగు చక్రాల వాహనం ఉందంటూ లేనిపోని సాకులు చూపి నిజమైన నేతన్నలను అనర్హులుగా ప్రకటించారు. కానీ, లబ్ధిదారుల తుది జాబితాను నిశితంగా పరిశీలిస్తే ఎప్పుడో చనిపోయిన వారి పేర్లను సైతం లబ్ధిదారుల లిస్టులో చేర్చి ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసేందుకు దళారులతో అధికారులు చేతులు కలిపినట్లు స్పష్టంగా బయటపడింది.

గడువు పెంపు

గందరగోళం నడుమ, బాధితుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గడువు పెంచక తప్పలేదు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ సచివాలయాలలో వందలాది మంది దరఖాస్తులను అందజేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నిజమైన నేతన్నలు ఎవరో మరోసారి సమగ్రంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, తమకు న్యాయం చేయాల్సిందిగా చేనేత కార్మికులు కోరుతున్నారు.

బి.కొత్తకోట(పెద్దతిప్పసముద్రం): అర్హులైన చేనేత కార్మికులందరికీ ‘నేతన్న సేవ’ పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం స్థానిక జ్యోతి చౌక్‌లో చేనేత కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు కృష్ణప్ప, మనోహర్‌రెడ్డి, తంబళ్లపల్లి పరిరక్షణ సమితి అధ్యక్షుడు మొరుంపల్లి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. మండలంలో దాదాపు 400 మంది చేనేత కార్మికులు ఉండగా, కేవలం 70 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చడం దారుణమన్నారు. అధికారులు కూటమి నేతలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని అర్హులకు మొండిచేయి చూపారని, అనర్హులకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. అర్హులైన చేనేత కార్మికులకు 10 రోజుల్లోగా న్యాయం చేయకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో చేనేత నాయకులు బషీర్‌ఖాన్‌, అష్రఫ్‌అలి, తంబయ్యశెట్టి, తరుణ్‌లతో పాటు నందిశెట్టి వీధికి చెందిన వందలాది మంది చేనేత కార్మికులు పాల్గొన్నారు.

ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఏ రకమైన దౌర్భాగ్య స్థితికి చేరిందనడానికి కురబలకోట మండలానికి చెందిన రామక్క (65) అనే వృద్ధురాలి ఉదంతమే సజీవ సాక్ష్యం. ఈమె చనిపోయి కూడా ఇప్పటికే రెండేళ్లు కావస్తోందని స్థానిక గ్రామస్థులు తెలిపారు. అయినా సరే పక్క మండలానికి చెందిన ఈమె పేరు ‘నేతన్న సేవ’ లబ్ధిదారుల జాబితాలో యథేచ్ఛగా కొనసాగుతుండడం చూసి గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేకాదు, ఈమె పేరుతో చేనేత కార్మికులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ (ఫ్రీ కరెంటు) కనెక్షన్‌ కూడా ఉన్నట్లు వెల్లడవడంతో స్థానికులు మరింత ఆశ్చర్యపోతున్నారు. అసలు మగ్గం నేయడం కూడా రాని ఒక వృద్ధురాలు, అది కూడా రెండేళ్ల క్రితమే మరణించిన వ్యక్తి పేరు నేతన్న సేవ అర్హుల జాబితాలోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement