ప్రొద్దుటూరు : ‘మా గ్రామంలో దాదాపు అందరం మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామానికి 200పైగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం మంజూరైంది. ఈ ప్రభుత్వంలో తమ గ్రామంలో ఒక్కరికీ పథకం మంజూరు కాలేదు’ అంటూ మండలంలోని పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీ నరసింహాపురం గ్రామానికి చెందిన నేతన్నలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చేనేత జౌళి శాఖ ఫీల్డ్ ఆఫీసర్ శేషగిరి రావుతోపాటు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ హర్షవర్ధన్‌రెడ్డి గ్రామానికి రాగా చేనేత కార్మికులంతా తిరగబడ్డారు. మామూళ్లు ఇవ్వకపోవడం వల్లే తమ దరఖాస్తులను పైకి పంపలేదా అని ప్రశ్నించారు. జిల్లాలోనే నరసింహాపురం గ్రామం అంటే చేనేత కార్మికులని గుర్తింపు ఉందని, అలాంటి తమ గ్రామంలో ఒక్కరికి కూడా నేతన్న సేవ పథకం వర్తింపజేయకపోవడం ఏంటని తూర్పారబట్టారు. వెల్ఫేర్ అసిస్టెంట్ హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నానన్నారు. సమయం లేని కారణంగా గడువు లోగా పంపలేకపోయానన్నారు. ఈ సందర్భంగా ఫీల్డ్ ఆఫీసర్ శేషగిరి రావు మాట్లాడుతూ దరఖాస్తులు తమకు అందడంలో ఆలస్యం కారణంగానే పథకం మంజూరు కాలేదన్నారు. రెండో దశలో తప్పనిసరిగా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
అధికారులపై నేతన్నల తీవ్ర ఆగ్రహం


