కడప అర్బన్: ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు ఆందోళనలను చేపట్టారు. ఇందులో భాగంగా కడపలోని జీజీహెచ్ (రిమ్స్)లో బుధవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను సాయంత్రం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా కడప జీఎంసీ (రిమ్స్) జూడా అధ్యక్షుడు డాక్టర్ ఎం. రవితేజ నాయక్, ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మీకాంత్, కార్యదర్శి యశ్వంత్ కృష్ణ,సంయుక్త కార్యదర్శి డాక్టర్ మారుతీనాయక్, హౌస్‌సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డిలతో పాటు కార్యదర్శి డాక్టర్ మేఘనలతో పాటు, పీజీలు,సీనియర్ రెసిడెంట్‌లు, హౌస్‌సర్జన్‌లు తమ ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలనీ ప్రధానమైన డిమాండ్‌గా ఆందోళనను కొనసాగిస్తున్నామన్నారు. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలను (స్టైఫండ్స్) వెంటనే విడుదల చేయాలన్నారు.


