● పట్టాలపై ‘నార్త్’ మాఫియా..
ప్రమాదం జరిగినా ‘సిక్’ డ్రామాలు
● రైల్వేలో పెచ్చుమీరుతున్న
ప్రాంతీయ పక్షపాతం
● డౌన్ ట్రాక్‌లో అదుపుతప్పిన భారీ ట్రాలీ
● ప్రాణభయంతో దూకేసిన
నలుగురు కార్మికులు
● జోన్ అధికారులకు తెలియకుండా
సర్దుబాటు
రాజంపేట: రైల్వే శాఖలో ఉత్తర భారత అధికారుల బరితెగింపు, అడ్డగోలు నిర్లక్ష్యం పతాక స్థాయికి చేరింది. భద్రతా నిబంధనలను గాలికొదిలేసి ఘోర ప్రమాదానికి కారణమవడమే కాకుండా, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా క్షేత్రస్థాయిలోనే ‘మేనేజ్’ చేసిన సంచలన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైలింజన్, ట్రాలీ ఢీకొన్న సంఘటన ఇలా..
ఈ నెల 5వ తేదీన మంటపంపల్లె–నందలూరు రైల్వే స్టేషన్ల మధ్య మౌలాతట్ సమీపంలో రైలుపట్టాల మరమ్మతుల నిమిత్తం ట్రాక్‌పై నిబంధనల ప్రకారం ‘రెడ్ ఫ్లాగ్’ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంటపంపల్లె వైపు నుంచి ఓ అధికారి, నలుగురు ఉత్తరాది ప్రాంతానికి చెందిన కార్మికులు ఇంజినీరింగ్ ట్రాలీని రన్ చేసుకుంటూ వచ్చారు. అయితే, ట్రాక్ కొంతదూరం వెళ్లేసరికి అక్కడ డౌన్ (వాలు) ఉండటంతో భారీ ఇంజినీరింగ్ సామాన్లతో ఉన్న ఆ ట్రాలీ వేగం ఆకస్మాత్తుగా పెరిగింది. ట్రాలీలో ఉన్న వారంతా కొత్తవారు కావడం, వారికి ఆపరేటింగ్ విధానంపై కనీస అవగాహన లేకపోవడంతో వేగంగా వెళ్తున్న ట్రాలీని అస్సలు ఆపలేకపోయారు.
ప్రాణభయంతో దూకేసిన సిబ్బంది..
లోకోపైలట్ దిగ్భ్రాంతి
ట్రాలీ పూర్తిగా అదుపు తప్పిందని గ్రహించిన కార్మికులు ప్రాణభయంతో కదులుతున్న ట్రాలీలో నుంచి కిందకు దూకేశారు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అదుపుతప్పిన ఆ ట్రాలీ పట్టాలపై అమర్చిన ‘రెడ్ బ్యానర్’ను సైతం బలంగా దాటుకుంటూ వెళ్లి.. లూప్‌లైన్‌లో కడప వైపు వెళ్లడానికి సిద్ధంగా నిలిచి ఉన్న గూడ్స్ రైలు ఇంజన్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో ఇంజన్‌లోని లోకోపైలట్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకవేళ గూడ్స్ రైలు గనుక రన్నింగ్‌లో ఉండి ఉంటే మాత్రం రైలు పట్టాలు తప్పి ప్రాణనష్టం జరిగేది.
గాయపడినా దొంగ హాజరు.. ‘సిక్’ రికార్డుల దగా
ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న స్టేషన్ మాస్టర్, రన్నింగ్‌స్టాప్, స్థానిక ఇంజినీరింగ్ అధికారులు అంతా ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. తాము చేసిన ఘోర తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఈ ప్రమాద సంఘటనను జోన్ ఉన్నతాధికారుల వరకు వెళ్లకుండా గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టారు. పైగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నార్త్ కార్మికులను కాపాడేందుకు స్థానిక అధికారులు నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. గాయపడిన వారికి అధికారికంగా ‘సిక్’ (వైద్య సెలవు) రాసి రికార్డుల్లో చూపించాల్సి వస్తే జోన్ ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని భయపడి.. వారు ఆసుపత్రి పాలైనా, ‘సిక్’లో కాకుండా రెగ్యులర్ డ్యూటీలోనే ఉన్నట్లు రికార్డుల్లో అక్రమంగా హాజరు వేయించుకున్నారు. ఈ దొంగ హాజరు వ్యవహారం ఇప్పుడు రైల్వే వర్గాల్లో తీవ్రమైన హాట్ టాపిక్‌గా మారింది.
రైల్వేలో పెరిగిపోతున్న ‘నార్త్ ఫీలింగ్’
ప్రస్తుతం రైల్వేలోని అన్ని విభాగాలలోనూ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారే తిష్ట వేశారు. ఎక్కడ చూసినా నార్త్ వారే కనిపిస్తుండటంతో తెలుగు ఉద్యోగులు మచ్చుకై నా కనిపించని దుస్థితి నెలకొంది. నార్త్ నేతలు ఎంతటి ఘోర నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా, ఎలాంటి ప్రమాదాలకు కారకులైనా మరే ఇతర చర్యలు కానీ ఉండవని రైల్వే వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. చివరకు డివిజన్ స్థాయి నుంచి జోన్ స్థాయి వరకు ఉన్న ఉన్నతాధికారులు కూడా ఈ ‘నార్త్ ఫీలింగ్’ మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకోలేక, ఏమీ చేయలేని తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారనే ఆరోపణలు రైల్వే కార్మిక వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు జరిగిన గూడ్స్ ఇంజన్, ట్రాలీ ప్రమాదమే ఇందుకు సజీవ నిదర్శనమని, దీనిపై రైల్వే బోర్డు ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ జరిపించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నందలూరు సీనియర్‌సెక్షన్ ఇంజినీర్ కార్యాలయం
నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఇంజినీరింగ్ ట్రాలీ ఢీ కొట్టిన దృశ్యం (ఊహాచిత్రం)


