హరివిల్లులా శ్రావణం.. ప్రతి ఇల్లూ హరినందనం ! | - | Sakshi
Sakshi News home page

హరివిల్లులా శ్రావణం.. ప్రతి ఇల్లూ హరినందనం !

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

జ్ఞానసిద్ధిని అందించే మాసం

రాజంపేట టౌన్‌/కడప సిటీ: ఆకుపచ్చని ఆషాఢం ముగిసి, ముంగిట తోరణాలు కట్టే శ్రావణం వచ్చేసింది. క్యాలెండర్‌లో శ్రావణ మాసం అడుగుపెడుతుంటే నే చాలు.. తెలుగు ఇంటి కోడలి మనసు నోముల వైపు పరుగులు తీస్తుంది. ఈ పవిత్ర మాసం ప్రారంభం కానుండటంతో, లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు ముంగిళ్లు ముస్తాబవుతున్నాయి. ఈ ముప్పై రోజులూ పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లూ ఒక నందనవనాన్ని తలపించనుంది.

శ్రవణ నక్షత్రం.. విష్ణు ప్రశస్తం

పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రానికి సమీపంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం కావడంతో.. ఈ నెలంతా హరినామ స్మరణతో మారుమోగిపోతుంది. శ్రావణంలో వచ్చే ప్రతి రోజూ పవిత్రమైనదే అ యినా.. మంగళ, శుక్ర, శనివారాలకు ఉన్న ప్రాధాన్యత వేరు. మంగళవారం మంగళగౌరి పూజలతో కొత్త కోడళ్లు, శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో ముత్తై దువులు, శనివారం వేంకటేశ్వరుడి కొలువుతో ఇళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి.

ఈసారి ఐదు శుక్రవారాల మురిపెం

ఈ ఏడాది శ్రావణ మాసంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. మాసం ప్రారంభమైన మరుసటి రోజే మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రానుంది. అంతేకాదు, ఈసారి శ్రావణంలో మొత్తం ఐదు శుక్రవారాలు రావడం మరింత విశేషం. దీంతో లక్ష్మీదేవి ఆరాధనకు, ఉపవాస దీక్షలకు మహిళలు ఇప్పటికే పట్టుచీరలు, పూజా సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక అమ్మవారి ఆలయాలన్నీ ప్రత్యేక అలంకరణలు, శ్రావణ మంగళ హారతులతో భక్తులను ఆకర్షించనున్నాయి.

బంధాల పండుగలు.. పెళ్లిళ్ల సందడులు

సంస్కృతి, సాంప్రదాయాల సమాహారమైన శ్రావణంలో.. వరలక్ష్మీ వ్రతంతో పాటు నాగుల చవితి, బంధాల మాధుర్యాన్ని పంచే రాఖీ పౌర్ణమి, ఉట్టి సంబరాల శ్రీకృష్ణాష్టమి వంటి పెద్ద పండుగలు వరుసకట్టనున్నాయి. ఇవన్నీ కుటుంబాల మధ్య బాంధవ్యాలను మరింత పెంచనున్నాయి. మరోవైపు, చాన్నాళ్లుగా మూతపడిన శుభముహూర్తాల గడియలు మళ్లీ తెరుచుకోవడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంధువుల రాకపోకలు, పట్టువస్త్రాల హడావుడితో శ్రావణం సరికొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది.

కళ్యాణ మండపాలు కళకళ.. ఉపాధి పండగ

ఆషాఢ మాసం కారణంగా నిలిచిపోయిన శుభ ముహూర్తాలు శ్రావణం రాకతో మళ్లీ ఊపందుకున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, భూమి పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు వంటి ఎన్నో శుభకార్యాలు ఈ నెలలోనే నిర్వహించేందుకు జనం సిద్ధమయ్యారు. దీంతో జిల్లాలోని కళ్యాణ మండపాలన్నీ ఇప్పటికే పూర్తిగా బుక్‌ అయిపోయి కళకళలాడుతున్నాయి. ఈ శ్రావణ సీజన్‌ పై వస్త్ర దుకాణాలు, బంగారు వ్యాపారులు, మంగళవాయిద్యాల కళాకారులు, పూల వ్యాపారులు, క్యాటరింగ్‌ సిబ్బంది, డెకరేషన్‌ నిర్వాహకులు, ఆర్కెస్ట్రా బృందాల వంటి ఎంతోమంది ఉపాధి కార్మికులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

శాఖాహారంతోనే ఆరోగ్యం..

శ్రావణ మాసం కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య రీత్యా కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మొబైల్‌ యాప్‌ లలో ఆర్డర్‌ పెడితే నిమిషాల్లో ఇంటికే మాంసాహారం వచ్చే వెసులుబాటు ఉండటంతో చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు అతిగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలాంటి తరుణంలో శ్రావణ నియమాల వల్ల మెజారిటీ ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటూ కేవలం సాత్విక, శాఖాహార భోజనానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇది శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనికి తోడు మహిళలు, పురుషులు ఉదయాన్నే స్నానాలు ఆచరించి ఆలయాలు, ఇళ్లలో నిత్యం పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మాసమంతా ఆధ్యాత్మిక చింతనతో గడపడం వల్ల మనిషిని సన్మార్గం వైపు పయనింపజేసేందుకు దోహదపడుతుంది.

శ్రావణమాసం ఎంతో శుభప్రదమైనది. ఈ మాసం మానవాళికి జ్ఞానసిద్ధిని అందించే కాలంగా పురాణాల్లో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఎంతో పవిత్రమైనది మరియు సకల దేవతారాధనకు అత్యంత అనుకూలమైనది. ముఖ్యంగా ఈ నెలలో మహిళలు శ్రద్ధతో చేసే లలితా సహస్రనామ పారాయణం వల్ల అపారమైన పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి. – జనార్దన్‌ స్వామి, పురోహితుడు

నోములు, వ్రతాల వేళ..

ముంగిట ముగ్గుల హేల

పెళ్ళి బాజాల సందడి..

ఆలయాల్లో ఆధ్యాత్మిక సడి

ఐదు శుక్రవారాల మురిపెం..

ఈ నెలంతా లక్ష్మీ కటాక్షం

రేపటి నుంచి

శ్రావణమాసం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement