డీఎస్సీ అక్రమాలపై పోరు | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై పోరు

Aug 10 2026 12:46 AM | Updated on Aug 10 2026 12:46 AM

సాక్షి, మదనపల్లె : డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై, అర్హులైన అభ్యర్థులకు జరిగిన తీవ్రమైన అన్యాయంపై వైఎస్సార్‌ సీపీ పోరుబాట పట్టింది. బాధితులకు అండగా ఉద్యమిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి బాధిత డీఎస్సీ అభ్యర్థుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. అయినప్పటికీ ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోకపోగా, అభ్యర్థనను పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలో బాధిత డీఎస్సీ అభ్యర్థుల పక్షాన న్యాయం కోసం ఉద్యమించింది. రోజుల తరబడి రోడ్లపైకెక్కి నిరసన గళమెత్తింది. జిల్లా వ్యాప్తంగా బాధిత డిఎస్సీ అభ్యర్థులు, యువజనులు, విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమాలకు బాసటగా నిలిచారు.

వరుసగా నిరసన కార్యక్రమాలు

పార్టీ పిలుపుమేరకు జిల్లాలో డీఎస్సీ అభ్యర్థుల పక్షాన వైఎస్‌ఆర్సీపీ నేతలు వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై 28న జిల్లా కేంద్రం మదనపల్లెలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌ రెడ్డి, రమేష్‌ కుమార్‌ రెడ్డి, సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ నిరసన ధర్నా నిర్వహించి డీఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించారు. జూలై 31న మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ జాయిన్‌ కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారు. తర్వాత ఈనెల 3, 4 తేదీల్లో నియోజకవర్గాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి డీఎస్సీ అక్రమాలపై చర్చించి నిలదీశారు. 6, 7, 8 తేదీల్లో మూడు రోజులు నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచారు. తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నేడు భారీ ర్యాలీలు

డీఎస్సీ బాధిత అభ్యర్థులకు అండగా, వారికి జరిగిన అన్యాయంపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి లోకేశ్‌ రాజీనామా డిమాండ్‌ తో సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ ఆధ్వర్యంలో రాజన్న విగ్రహం నుంచి బస్టాండ్‌, పోలీస్‌ స్టేషన్‌, ఎంబిటి రోడ్డు మీదుగా గూగుల్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో తంబళ్లపల్లె వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ నుంచి రాగిమాను సర్కిల్‌ వరకు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి నేతాజీ సర్కిల్‌ వరకు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేవీ పల్లి మండలంలో, మదనపల్లెలో సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది.

లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే..

సోమవారం జరిగే ర్యాలీల్లో యువజనులు, విద్యార్థులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ర్యాలీల ద్వారా వైఎస్‌ఆర్సీపీ నేతలు అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని, లోకేశ్‌ మంత్రి పదవికి రాజీనామా విషయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

డీఎస్సీ–2025 అక్రమ నియామకాలపై..

నేడు నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్‌ఆర్సీపీ ర్యాలీలు

పుంగనూరులో హాజరుకానున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి

ఇప్పటికే వివిధ దశల్లో కార్యక్రమాల నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement