గుర్రంకొండ : రెడ్డెమ్మా.. చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. కర్ణాటకా, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
రాయచోటి యువకుడికి
ఢిల్లీ ఐఐటీ పీహెచ్‌డీ పట్టా
రాయచోటి : రాయచోటికి చెందిన జె.నిఖిల్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు జె.వెంకట్రామిరెడ్డి, నాగేశ్వరమ్మ దంపతుల కుమారుడు జె.నిఖిల్‌కుమార్‌రెడ్డి పట్టా పొంది రాయచోటి కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి ప్రధా ని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ‘దేశీయంగా సాంకేతిక ఆవిష్కరణలను పెంచడం పరిశోధకులకు గ్లోబల్ స్టాండర్డ్ కంప్యూటింగ్‌పవర్‌ను అందించడం’ అనే కీలకమైన అంశంపై చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
సాక్షి, మదనపల్లె : స్థానిక కలెక్టరేట్‌లో సోమ వారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదుల సేకరణ జరుగుతుందన్నారు. ఈ స్థాయిల్లో పరిష్కారంకాని ఫిర్యాదులను ప్రజలు కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు అందించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
నేడు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ
సాక్షి, మదనపల్లె : జిల్లాలో విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం దృష్టికి తీసుకు రావాలని డిస్కం జిల్లా ఎస్‌ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి వినియోగదారులు ఫోన్ ద్వారా తమ సమ స్యలను తెలియజేయాలని కోరారు. 94408 17449 నంబర్‌కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం
మదనపల్లి (కురబలకోట) : ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు. ఆదివారం మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఆదివాసీ హక్కులు, సంక్షేమానికి ప్రత్యేక రక్షణ కల్పించిందన్నారు. విద్య, వైద్య, రహదారులు, తాగునీరు, ఉపాది తదితర మౌళిక వసతుల అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. గిరిజనుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మ దనపల్లిలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. డీఆర్‌ఓ వెంకటేష్, అదనపు ఎస్పీ వెంకటాఽద్రి, జిల్లా గిరిజన సంక్షేమ అధి కారి తేజస్విని, డీవీఎంసీ సభ్యులు శ్రీనివాసు లు, చంద్రశేఖర్, రామకృష్ణ, మునీంద్ర నాయ క్, ప్రిన్సిపల్ రంగనాయకులు పాల్గొన్నారు.


