నేతన్న సేవలోనూ...
● పరిశీలన పేరుతో అర్హులకు మొండిచేయి
● గగ్గోలు పెడుతున్న బాధితులు
మదనపల్లి (కురబలకోట) : రాష్ట్ర ప్రభుత్వ ‘నేతన్న సేవ’ పథకం చేనేత కార్మికులకు తీవ్ర నిరాశను కలిగించింది. ఆర్థిక చేయూత అందిస్తామని గొప్పలు చెప్పి నిలువునా మోసం చేసింది. అర్హత ఉన్నా నిబంధనల కొర్రీలు పెట్టి అనర్హులుగా మార్చింది. రెండేళ్ల తర్వాత చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చేనేత దినోత్సవం రోజున నేతన్న సేవ పేరుతో పథకాన్ని అమలు చేసింది. నేతన్నల ఖాతాలో రూ. 25 వేలు చొప్పున జమ చేసింది. కాగా అన్నమయ్య జిల్లాలో 5069 మంది పేర్లతో ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపితే.. 3869 కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరింది. అధికారులు పంపిన ప్రతిపాదనల జాబితా కంటే ఇంకా ఆన్‌లైన్ చేయని వారు వేలాది మంది ఉన్నారు. తొలి జాబితాలోనే చాలా మంది పేర్లు కన్పించలేదు. దీంతో పేర్లు లేని వారు ఆయా సచివాలయాల్లో మరో సారి దరఖాస్తు చేశారు. ఫలితం లేక అర్హులు నిట్టూర్చారు. మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. జిల్లాలో మదనపల్లిలో అత్యధికంగా 2756 మందికి లబ్ధి చేకూరింది. ఆతర్వాత తంబళ్లపల్లి నియోజక వర్గంలో 692 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఆఖరి స్థానంలో పుంగనూరులో 39మందికి మాత్రమే లబ్ధి చేకూరినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం చాలా మంది అర్హులకు కోత కోసినట్లు తెలుస్తోంది.


