చర్యలు తీసుకుంటాం
● ఆక్రమణకు గురైన
మురాద్‌బీ కుంట చెరువు
● యథేచ్చగా అక్రమ కట్టడాలు
● వంకనూ వదలని కబ్జాదారులు
గుర్రంకొండ పరిసరాల్లో గుట్టలను చదును చేసి ఫెన్సింగ్ ఏర్పాటు
ఆక్రమణలకు గురైన మురాద్‌బీ కుంటలో చేపట్టిన అక్రమ నిర్మాణం
గుర్రంకొండ: మండలంలోని ఖండ్రిగ గ్రామంలోని మురాద్‌బీ కుంట చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంది.రూ. ఆరు కోట్లు విలువ చేసే రెండున్నర ఎకరాల కుంటచెరువు స్థలం యథేచ్చగా ఆక్రమణలకు గురైంది. మరోవైపు కబ్జాలతో మురాద్‌బీ కుంట వంక రూపురేఖలు కోల్పోయింది.రూ.2కోట్లు విలువచేసే వంకను చదును చేసి ప్లాట్లుగా మార్చేశారు. గుర్రంకొండ పరిసరాల్లోని గుట్టలను పలువురు ఆక్రమణ దారులు జేసీబీలతొ చదును చేసేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
గుర్రంకొండ మార్కెట్‌యార్డుకు సమీపంలో మూడురోడ్ల కూడలి ఉంది. ఈ సర్కిల్ వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చెందింది. ఈ సర్కిల్ పక్కనే కండ్రిగ గ్రామానికి చెందిన మురాద్‌బీ కుంట ఉంది. సర్వే నంబర్ 16/1లో 3.37 ఎకరాల్లో కుంట విస్తరించి ఉంది. గత మూడేళ్లుగా కుంట పరిసరాల్లోని స్థలాలకు విలువ పేరిగిపోయి రియల్‌ఎస్టేట్ బాగా పుంజుకొంది. ఈ పరిసరాల్లో కుంట(రెండుసెంట్లు) స్థలం విలువ రూ. 8లక్షల నుంచి రూ. 12లక్షల వరకు ధరలు పలుకుతోంది. ఈనేపథ్యంలో పలువురు ఆక్రమణదారుల కళ్లు ఈ కుంటపై పడింది. గత మూడేళ్లుగా కొద్దిగా కొద్దిగా చెరువును వ్యవసాయం, నిర్మాణాలపేరుతో ఆక్రమించేశారు. ఇప్పటికే సుమారు రెండు ఎకరాల చెరువును ఆక్రమించేశారు. దీని విలువ మార్కెట్లో సుమారు రూ. 6 కోట్ల వరకు ఉంటుంది. ఎలాంటి పట్టాలు లేక పోయినా అందులోనూ ప్రకృతి సహజ సిద్ధమైన చెరువులో నిర్మాణాలు చేపట్టారు. ఓవైపు కబ్జాలు, మరోవైపు ఆక్రమణలతో మురాద్‌బీ కుంట చెరువు ఉనికి నామమాత్రంగా ఉండడం గమనార్హం
రూపురేఖలు కోల్పోయిన వంక
సర్వే నంబర్ 503లో మురాద్‌బీ కుంటకు వర్షపునీరు చేర్చే వంక ఉంది. కుంటకు ఎగువవైపు ఉన్న పొలాలు, గుట్టల్లో కురిసే వర్షపునీరు ఈ వంక ద్వారా మురాద్‌బీ వంకకు చేరుతుంది. అయితే ఆక్రమణదారులు వంకను వదలకుండా ఆక్రమించేశారు.ప్రస్తుతం వంక రూపురేఖలు కోల్పోయింది. వర్షపునీరు చేరే మార్గాలు మూసుకుపోయాయి. మురాద్‌బీ కుంటలో ఆక్రమించుకున్న స్థలాలకు ఏకంగా సరిహద్దు రాళ్లు నాటేశారు. కుంటను జేసీబీలతో చదునుచేసేశారు. ప్రస్తుతం మురాద్‌బీ కుంట ఆనవాళ్లు లేకుండా పోయాయి. మురాద్‌బీకుంట వంక 503–8లో వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని చదును చేసుకున్నారు. జేసీబీలతో వంకను ధ్వంసం చేసి ప్లాట్లు విక్రయించడానికి సిద్దం చేసుకొన్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వోలు, సర్వేయర్లు రెండునెలల క్రితం వంకస్థలాన్ని సర్వేచేశారు. రూ.2 కోట్లు విలువచేసే మొత్తం 50 సెంట్ల మేరకు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. అయితే ఇంతవరకు రెవెన్యూ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు.
గుట్టలను వదలలేదు..
గుర్రంకొండ పట్టణ పరిసరాల్లోని తలారివాండ్లపల్లె మార్గం, జీవనతోపు ప్రాంతాల్లో కబ్జాకోరులు ప్రకృతి సహజ సిద్ధమైన గుట్టలను వదలడంలేదు. ఆయ ప్రాంతాల్లో పలుచోట్ల ఇప్పటికే గుట్టలను ఆక్రమించుకుని జేసీబీలతో చదును చేసేశారు. అనుభవంలో ఉన్న పొలాలతో పాటు పక్కనున్న గుట్టలను కబ్జా చేసేస్తున్నారు. కొంతమంది రియల్‌ఎస్టేట్ వ్యాపారులు రైతుల దగ్గర డీకేటీ భూములను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా గుట్టలను తవ్వేస్తున్నారు. పశువులకు గడ్డి, ఇతర పశుగ్రాసం అందించే గుట్టలు రియల్‌ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలతో వాటి రూపురేఖలు కోల్పోతున్నాయి. కొంతమంది గుట్టపైన ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసి కబ్జా చేస్తున్నారు. అసలు గుట్టలు, కొండలకు రెవెన్యూ అఽధికారులు ఎలా పట్టాలు ఇచ్చారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది.
తూతూ మంత్రంగా చర్యలు
ఓవైపు చెరువులు, కుంటలు, మరోవైపు గుట్టలు కబ్జాలకు గురువుతున్నా రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలున్నాయి. ఆక్రమణలపై ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఫిర్యాదు చేసినా రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆక్రమణదారులు యథేచ్చగా తమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే గుట్టలను చదును చేసి అటువైపు ఎవరూ రాకుండా ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
మురాద్‌బీ కుంటలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఇప్పటికే ఆడ్డుకున్నాం. ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగిస్తాం. మురాద్‌బీ కుంటను, వంకను సర్వేచేసి సరిహద్దులుగా కందకాలు తవ్వించి రక్షణ చర్యలు చేపడతాం. చెరువులు, వంకలు, గుట్టలను ఆక్రమించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం.
– ఫణీకుమార్, తహసీల్దార్, గుర్రంకొండ.


