భక్తితో ప్రణమిల్లి.. భుక్తి లేక తల్లడిల్లి ! | - | Sakshi
Sakshi News home page

భక్తితో ప్రణమిల్లి.. భుక్తి లేక తల్లడిల్లి !

Jul 27 2026 1:42 AM | Updated on Jul 27 2026 1:42 AM

ఆకలితో వెళ్తే ఎలా అన్నప్రసాదాలు అందుబాటులోకి తీసుకురావాలి

సౌమ్యనాథాలయంలో

అన్న ప్రసాదం కరువు..

టీటీడీ చర్యలు తీసుకోవాలని

భక్తుల విన్నపం

చోళుల కాలంలో నిర్మించిన నందలూరు సౌమ్యనాథాలయం

రాజంపేట: అక్కడ అడుగుపెట్టగానే రాజసం ఉట్టిపడే గోపురం కనువిందు చేస్తుంది.. మూలవిరాట్‌ను దర్శించుకోగానే మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది.. చరిత్రకు నిలువుటద్దం ఆ ఆలయం.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వైష్ణవాలయం.. అదే చోళుల కాలంలో నిర్మితమైన నందలూరు సౌమ్యనాథాలయం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా కర్నూలు, తిరుపతి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి నిండైన భక్తిభావంలో మునిగిపోతారు.

పిడికెడు అన్న ప్రసాదం కరువు...

చరిత్రకు ఘనకీర్తిగా... ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా అలరారుతున్న ఈ ఆలయంలో అన్న ప్రసాదం కరువైంది. నిండైన భక్తితో ప్రదక్షిణలు చేశాక.. చుట్టూ చూస్తే పిడికెడు భుక్తి కానరాక ఆకలితోనే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థ్ధానం అనుబంధ ఆలయాల వద్ద ఆకలి అనే మాటకు చోటులేకుండా 56 ఆలయాల్లో మార్చి నుంచి రెండుపూటలా అన్నదానం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అన్న ప్రసాదాలను వడ్డించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నందలూరులోని సౌమ్యనాథాలయంలో అన్నప్రసాదం మాటే కరువైంది. ఇదివరకు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు స్థానికంగానే దాతలు, భక్తులు ట్రస్టు పేరిట ఆలయంలో అన్నప్రసాదం చేసేవారు. టీటీడీలోకి విలీనమైన తర్వాత బయటివారు అన్న ప్రసాదాలు చేయడానికి వీల్లేదన్న అధికారుల సంకేతాలతో ఆ కార్యక్రమాలు ఆగిపోయాయి.

కేంద్ర పురావస్తుశాఖ అడ్డుపుల్ల!

ఆలయానికి ప్రతి రోజూ వందలాది మంది భక్తులు వస్తారు. శనివారం రోజైతే ఆ సంఖ్య రెట్టింపవుతుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భక్తజనంతో ఆలయ ఆవరణ కిటకిటలాడుతోంది. అన్నప్రసాదం లేకపోవడం భక్తకోటి ఆకలితోనే వెనుదిరుగుతోంది. కాగా సౌమ్యనాథాలయంలో ఒక్క పూటైనా అన్నప్రసాదం పంపిణీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థ్ధానం ముందుకొచ్చినా కేంద్రపురావస్తు శాఖ అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారి ఒకరు కేంద్రపురావస్తుశాఖకు అన్నప్రసాదాల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరినట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. మరి అక్కడి నుంచి అనుమతులు వచ్చి.. ఆపై టీటీడీ వెనువెంటనే అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు చేపడితే భక్తులకు భుక్తి బాధలు తప్పినట్లే. సౌమ్యనాథుడే అనుగ్రహించాలని భక్తులు కోరుతున్నారు.

సౌమ్యనాథాలయానికి వచ్చిన భక్తులు ఆకలితో వెనుదిరిగితే ఎలా. ఒంటిమిట్టలో మాదిరి ఒక పూట పెట్టినా భక్తుల ఆకలి తీరుతుంది. చాలా మంది భక్తులు నందలూరు బస్టాండుకెళ్లి భోంచేస్తున్నారు. అలా కాకుండా ఆలయంలో అన్నప్రసాదాలు పెడితే బాగుంటుంది.

– వల్లకొండు పద్మావతి, భక్తురాలు

ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలను అందచేయాలి. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసేందుకు జిల్లా నుంచే కా కుండా అనేక జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నా రు. వారికి సకాలంలో ఆకలి తీర్చేందుకు అన్నప్రసాదాల పంపిణీ దోహదపడుతుంది. టీటీడీ చర్యలు తీసుకోవాలి. – శివపార్వతి, భక్తురాలు, ముద్దనూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement