మదనపల్లె టౌన్: మతిస్థిమితం లేని ఓ మహిళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్‌కి అడ్డుగా రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మదనపల్లెకు వచ్చారు. ఆయన కాన్వాయ్ పట్టణంలోని ప్రధాన రహదారిపై వెళ్తుండగా, హఠాత్తుగా ఓ మహిళ కారుకు అడ్డంగా వచ్చి నిలుచుంది. అప్రమత్తమైన ఎస్కార్ట్ పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ మహిళను జాగ్రత్తగా పక్కకు జరిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కాన్వాయ్‌ని ముందుకు పంపించారు. మంత్రి కారుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.


