సాక్షి, మదనపల్లె : ఎల్‌నినో జిల్లా ఖరీఫ్ వ్యవసాయాన్ని నిలువునా ముంచేసింది. జిల్లాలో ఏ ఖరీఫ్‌లోనూ నెలకొనని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. సాధారణంగా వర్షాభావ పరిస్థితులు, కరువు వచ్చినా ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎదురు కాలేదు. ఎల్‌నినో తెచ్చిన ఉపద్రవంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ రైతాంగాన్ని వెంటాడి వేధిస్తోంది. ఈ దారుణమైన వర్షాధార పరిస్థితిల మధ్య ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది. జూలై 15 తర్వాత పంటలు సాగుచేసిన దిగుబడి ఉండదు. ఇప్పుడు వర్షం లేకపోవడం వల్ల పంటలు సాగు అసాధ్యంగా మారింది. ఇకపై వర్షాలు కురిసినప్పటికీ ఖరీఫ్ పంటలు సాగు చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల మధ్య జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు ఎల్ నినో ముగింపు పలికింది.
దారుణమైన సాగు
గతంలో వచ్చిన కఠినమైన కరువులోనూ ఇప్పటి సాగు పరిస్థితులు లేవు. సాగు విస్తీర్ణంలో కనీసం సగమైన పంటలు విత్తడం జరిగేది. ఇప్పుడా పరిస్థితి కనుచూపుమేర లేదు. జిల్లాలో 46,055 హెక్టార్లలో వేరుశనగ సహా అన్ని రకాల పంటలు సాగు అవుతాయని, అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళికను అమలు చేసింది. సాధారణంగా జూన్‌లోనే 70 శాతానికి పైగా సాగు పూర్తయ్యేది. మిగతాది జూలై నెలలో జరిగేది. ఖరీఫ్ లో ఇప్పటిదాకా పంటల సాగు చేసింది కేవలం 2,428 హెక్టార్లలోనే. మిగిలిన 43,627 హెక్టార్ల భూమి బీడుగానే మిగిలింది. సాగు చేస్తున్న విస్తీర్ణం 5.27 శాతమే. అన్ని రకాల పంటలు వీటిలో సాగు చేశారు.
వేరుశనగ అధికం
జిల్లాలో సాగు అయిన 2,428 హెక్టార్లలో వేరుశెనగ 1,647 హెక్టార్లలో సాగు చేశారు. మిగిలిన 781 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేశారు. అయితే వేరుశనగ సాగు కావాల్సిన 27,016 హెక్టార్లలో 25,369 హెక్టార్లలో సాగుకు నోచుకోలేదు. జిల్లాలో సాగుచేసిన వేరుశనగ పంటలో పెద్దమండ్యం మండలం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మండలంలో 919 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సివుండగా 375 హెక్టార్లలో సాగై జిల్లాలోని మొదటి స్థానంలో నిలిచింది. దీనికి మించిన సాగు విస్తీర్ణం ఇతర ఏ మండలంలోనూ లేదు. బి.కొత్తకోట మండలంలో 1 ,115 హెక్టార్లకు గాను 105 హెక్టార్లలో, కంభం వారిపల్లె మండలంలో 1,842 హెక్టార్లకు గాను 180 హెక్టార్లలో, పీలేరు మండలంలో 1,312 హెక్టార్లకుగాను 200 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. జిల్లాలో అతి తక్కువగా రామసముద్రం మండలంలో 789 హెక్టార్లకుగాను కేవలం నాలుగు హెక్టార్ల హలోనే సాగు చేశారు.
గుర్రంకొండ జీరో
జిల్లాలోని 25 మండలాల్లో అరకొరగా పంటలు సాగు చేసినప్పటికీ.. గుర్రంకొండ మండలంలో మాత్రం ఒక్క సెంటు భూమి కూడా సాగు చేసినట్టు నమోదు కాలేదు. ఈ మండలంలో 954 హెక్టార్లలో పంటలు సాగు కావాలి. అందులో వేరుశనగ 506 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంది. అయితే ఈ మండలంలో ఏ పంట కూడా సాగుకు నోచుకోలేదు. ఈ ఖరీఫ్లో ఒక ఎకరా కూడా సాగు కానీ మండలంగా గుర్రంకొండ రికార్డులకు ఎక్కింది.
37 రోజులుగా చుక్క వర్షం లేదు
జిల్లాలో ఖరీఫ్‌లో ఇంతటి సుదీర్ఘమైన రోజులు వర్షాభావ పరిస్థితులు నెలకొనడం చూస్తున్నాం. జూన్ 13న జిల్లాలో వర్షపాతం నమోదైంది. తర్వాత 14వ తేది నుంచి జూలై 20 వరకు జిల్లాలోని 25 మండలాల్లో ఎక్కడా చుక్కవర్షం కురవలేదు. మేఘాలు కనిపిస్తున్నా వర్షం కురిసింది లేదు. 37 రోజులుగా వర్షం /ాడలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో, మున్ముందు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది.
పంట చేతికొచ్చేలా లేదు
వర్షాలు నమ్ముకుని మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఎకరాకు రూ.20 వేలు చొప్పున రూ.60 వేలు పెట్టుబడి పెట్టాను. పంట వేశాక వర్షాలు కురవలేదు. ఇప్పుడు పంట వాడు మొఖం పట్టింది. వర్షం కురిసే పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట నష్టపోతే ప్రభుత్వం ఆదుకోవాలి.
– పెద్దరెడ్డప్ప, రైతు, తంబళ్లపల్లె మండలం
జిల్లాలో సాధారణ సాగు 46,055 హెక్టార్లు
సాగు చేసింది 2,428 హెక్టార్లు
వేరుశనగ సాగు లక్ష్యం 27,016 హెక్టార్లు, సాగైంది 1,647 హెక్టారు


