దక్షిణాయనం ఆరంభం | - | Sakshi
Sakshi News home page

దక్షిణాయనం ఆరంభం

Jul 17 2026 1:16 AM | Updated on Jul 17 2026 1:16 AM

ఆధ్యాత్మికతకు ఆషాఢం ఆలవాలం

ప్రారంభమైన ఆషాఢమాసం

తొలి ఏకాదశి, వ్యాసపౌర్ణమి పండుగలు

మదనపల్లె సిటీ: ఆషాడమాసం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 12వతేదీ వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో అనేక విశిష్టతలు ఉన్నాయి. తొలి ఏకాదశి, గురుపౌర్ణమి(వ్యాస పౌర్ణమి), పూరీలో జగన్నాథయాత్ర ఈ మాసంలో నిర్వహిస్తారు. ఎటువంటి శుభకార్యాలు ఈ మాసంలో ఉండనందు వల్ల శూన్యమాసంగా పేర్కొంటారు.

మాస విశేషాలు, ప్రాముఖ్యత

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా చెబుతారు. వర్షబుతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆషాఢంలో చేసే సముద్ర స్నానాలు ఎంతో ముక్తిదాయకాలుగా భావిస్తారు. పాదరక్షలు, గొడుగు, ఉప్పుదానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఈ మాసంలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఇక పూర్వకాలం నుంచి ఆషాఢంలో కొత్త కోడలు పుట్టింటిలోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదు అనే నియమం కూడా ఉంది.ఈ మాసంలోనే వారాహి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు,అభిషేకాలు చేస్తారు. ఆషాఢంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోని సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకరరాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఆ ఆయనంలో సూర్యుడు భూమద్యరేఖకు దక్షిణంగా సంచిరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతల ప్రీతికరమని కూడా చెబుతారు.

గురుపౌర్ణమి

త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం ఈనెల 29తేదీన గురుపూర్ణిమ నిర్వహిస్తారు. దీనినే వ్యాసపూర్ణిమ అని అంటారు.ఆషాడ శుద్ధ పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆషాఢషష్టిని కుమారషష్టి గా జరుపుకుంటారు. ఆషాడసప్తమిని భానుసప్తమిగా జరుపుకుంటారు.

తొలి ఏకాదశి:

ఈనెల 25న శనివారం తొలి ఏకాదశి వస్తుంది. ఉత్తరం నుంచి దక్షిణ దిశగా పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఈ రోజున పగలు, రాత్రి,నిమిషం ,ఘడియ, విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతీత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ద ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోని వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢమాసం.దీనిని శూన్యమాసమని అంటారు. హిందూ సంప్రదాయంలో ఈ మాసానికి విశిష్ట స్థానం ఉంది. శుభకార్యాల కంటే వ్రతాలు, దైవారాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. – ఆలూరి ఫణికుమార్‌శర్మ,

వేదపండితులు,మదనపల్లె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement