కుదుటపడని పాలన | - | Sakshi
Sakshi News home page

కుదుటపడని పాలన

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

కుదుటపడని పాలన ఒక గది–రెండు కార్యాలయాలు

స్థానిక బెంగళూరు రోడ్డులోని పట్టు పరిశ్రమ శాఖ భవనంలో సహకార శాఖది విచిత్ర పరిస్థితి. జిల్లా సహకార శాఖకు, జిల్లా సహకార శాఖ ఆడిట్‌ కార్యాలయం ఒక గదిలో ఏర్పాటు చేశారు. గది మధ్యలో రికార్డులను అడ్డుగా ఉంచి కుడివైపు ఆడిట్‌ శాఖ, ఎడమవైపు సహకార శాఖ జిల్లా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి సహకార శాఖ పరిస్థితి అద్దం పడుతోంది.

మదనపల్లె: మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పడి వందరోజులైంది. అయితే అధికారులకు మాత్రం కార్యాలయాల ఏర్పాటుకు వంద అవస్థలు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. దీనికి ప్రభుత్వం ముందుచూపులేకపోవడం, జిల్లా కేంద్రం రాయచోటినుంచి మదనపల్లెకు తరలించే విషయంలో కనీస సన్నద్ధతకు అవకాశం ఇవ్వకపోవడమే కారణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో ప్రణాళిక బద్ధంగా వ్యవహరించింది. కొత్త జిల్లాలను 2022 ఏప్రిల్‌ 4నుంచి మనుగడలోకి వస్తాయని ముందుగానే ప్రకటించింది. ప్రభుత్వ వ్యవస్థలు జిల్లా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకొని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే నిర్ణయం హఠాత్తుగా తీసుకుని ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. జిల్లా కేంద్రం పాలన మొదలై 100 రోజులు గడిచిన ఇంకా కార్యాలయాలు కుదురుకోలేదు. అస్తవ్యస్త పరిస్థితుల మధ్య పనిచేస్తున్నాయి. ఇంకా పూర్తిస్థాయి కార్యాలయాలు రాయచోటి నుంచి తరలి రాలేదు.

ఒకరోజులో పాలన కేంద్రం మార్పు

2025 డిసెంబర్‌ 30న అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అప్పటిదాకా రాయచోటి కేంద్రంగా పనిచేస్తున్న జిల్లా కేంద్రం మదనపల్లెకు మారాల్సి వచ్చింది. ఉత్తర్వు జారీ అయిన మరుసటి రోజు అంటే డిసెంబర్‌ 31న జిల్లా కేంద్రం మనుగడలోకి రాగా కలెక్టర్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అదేరోజు నుంచి జిల్లా పాలన మొదలైంది. తర్వాత ఇక్కడికి రాయచోటిలోని జిల్లా కార్యాలయాల తరలింపు ప్రక్రియ మొదలైంది. జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సినంత, అవసరమైనస్థాయి కలిగిన కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు స్థిమితంగా కూర్చుంటున్నది లేదు.

సిద్ధం కాకనే ప్రకటన

మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే విషయం గత ఏడాది డిసెంబర్‌ లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు మదనపల్లె పేరుతోనే జిల్లా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేసింది. పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపి మదనపల్లెను జిల్లా కేంద్రం చేసింది. కాస్త గడువు ఇచ్చాక లేదంటే జిల్లా అధికారులు మదనపల్లె తరలేందుకు మానసికంగా సిద్ధమయ్యే సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం డిసెంబర్‌ 30న జీవో జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగంలో హడావిడి మొదలైంది. ఆయా జిల్లా శాఖల అధికారులు మదనపల్లెలో ఎక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలో దిక్కుతోచగా రాయచోటి కేంద్రంగా పనిచేస్తూనే మదనపల్లెలో కార్యాలయం ఏర్పాటు కోసం పరుగులు తీశారు.

బీటీ కళాశాల భవనాల్లోనే..

మదనపల్లెలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వసతులు, సౌకర్యాలతో పాటు ప్రభుత్వ భవనాలు లేవు. అధికారులు ఎంత ప్రయత్నించినా, వేట సాగించినా సౌకర్యవంతమైన భవనాలు కనిపించలేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో సత్వరమే కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున బీటి కళాశాల ట్రస్టుకు చెందిన వసతి గృహాలు, పట్టు పరిశ్రమశాఖ, సిఎల్‌ఆర్సీసి భవనాలు, సెరికల్చర్‌ రీలర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, బీటీ కళాశాల మహిళా హస్టల్‌, ఇలా అందుబాటులో ఉన్న భవనాల్లో జిల్లా కార్యాలయాలకు గదులు కేటాయించారు. బీఈడీ కళాశాల భవనాలు, బీటీ కళాశాల ఆవరణలోని భవనాలను అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. వాటిలోనే వీలైన మేరకు కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

కూర్చునే సౌకర్యం లేకున్నా..

మదనపల్లెలో జిల్లా కార్యాలయాల పరిస్థితి ఎలా ఉందంటే సౌకర్యవంతంగా నలుగురు కూర్చునే పరిస్థితి లేదు. కిందిస్థాయి ఉద్యోగికి కేటాయించే చిన్నగది లాంటి గదే జిల్లా కార్యాలయాలుగా మారాయి. అందులోనే డెస్క్‌టాప్‌లు, జిల్లా అధికారి టేబుల్‌, కుర్చీ, కార్యాలయానికొచ్చే వారికి కుర్చీలు, ఇలా అన్ని ఒక చిన్నగదిలోనే సమకూర్చుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దేవదాయ శాఖ, జిల్లా క్రీడల శాఖ, పర్యాటకశాఖ, మెప్మా, ఇలాంటి కార్యాలయాలకు ఒక గదిలోనే కేటాయించారు. ఈ కార్యాలయాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీటీ కళాశాల వసతి గృహంలో, పట్టు పరిశ్రమ శాఖ భవనంలో ఎక్కువ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఒక చిన్న గదిలో జిల్లాకు సంబంధించిన రికార్డులు, పనిచేసే సిబ్బంది, అధికారులకు ఏమాత్రం సరిపోదు. ఈ కార్యాలయాలకు వాష్‌రూమ్‌లు లేవు. ఇది ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

మదనపల్లె జిల్లా కేంద్రానికి వంద రోజులు

ఇప్పటికీ కుదురుకోని కార్యాలయాలు

ఒక గదిలో రెండు జిల్లా ఆఫీసులు

బోర్డులు తప్ప ప్రారంభంకాని వైనం

జిల్లా కేంద్రం మదనపల్లెలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌ఓ, డీఆర్‌డీఏ, డ్వామా, సీపీఓ, డీపీఓ తదితర ముఖ్య ప్రభుత్వశాఖల అధికారులు ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన వెంటనే ఇక్కడినుంచి పాలన మొదలు పెట్టారు. మొట్టమొదట కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ జిల్లా కేంద్రం అమలులోకి వచ్చిన డిసెంబర్‌ 31 నుంచి మదనపల్లె కేంద్రంగానే పాలన సాగిస్తున్నారు. పూర్తిస్థాయి పాలన కలెక్టరేట్‌ నుంచి సాగిస్తూ ప్రభుత్వశాఖలతో సమన్వయం చేస్తున్నారు. ఆయా శాఖలతో సమీక్షలు, సమావేశాలను నిత్యం నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు చేస్తున్నారు. అయితే పలుశాఖల జిల్లా అధికారుల పాలన ఇంకా కుదుటపడలేదు. కొన్నిజిల్లాశాఖలు ఇంకా రాయచోటిలో కొనసాగుతుండటంతో అధికారులు అక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇంకా తరలిరావాల్సిన కార్యాలయాలు పూర్తిస్థాయిలో తరలించి ఇక్కడి కార్యాలయాల నుంచే పాలన సాగిస్తే..అప్పటికి పూర్తిస్థాయిలో జిల్లా పాలన మొదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement