● నందిపల్లెలో రూ.7 కోట్లతో నిర్మాణం
● వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డి
సహకారం
● మారం శ్రీకాంత్‌రెడ్డి రూ.3 కోట్లకు పైగా వ్యయం
● నేడు మండల పూజ
కడప సిటీ/వేంపల్లె : ఆ యువకుడు లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లక్ష్మీదేవి కూడా లండన్ కంపెనీలోనే ఇంటి దగ్గరి నుంచే (వర్క్ ఫ్రం హోమ్) విధులు నిర్వర్తిస్తూ ఆలయ నిర్మాణానికి సిద్ధమయ్యారు. తన తల్లి నందిపల్లె గ్రామ సర్పంచ్ (ప్రస్తుతం మాజీ సర్పంచ్)గా ఉన్న మారం సులోచన, ఆయన భార్య లక్ష్మీదేవి అతనికి చేదోడు వాదోడుగా ఉండి ఆలయ నిర్మాణానికి సహకరించారు. రూ.35 లక్షలుగా అనుకున్న ఆలయ నిర్మాణం చివరకు రూ.7 కోట్లకు పైగా వెచ్చించి పూర్తి చేశారు. దాదాపు మూడు సంవత్సరాలకుపైగా సమయం పట్టింది. వేంపల్లె సమీపంలో పులివెందుల రోడ్డులో నందిపల్లె గ్రామ పరిసరాల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
ప్రాచీన కళ ఉట్టిపడేలా..
విజయనగర సామ్రాజ్యం కాలం నాటి గుడి నిర్మాణాలతో పోల్చకుండా.. ఆ తర్వాత నిర్మించిన ఆలయాల్లో దక్షిణ భారతదేశంలోనే నందిపల్లె నందీశ్వరాలయం పేరు గాంచింది. ఎక్కడా కూడా సిమెంటు, ఇటుక వాడకుండానే గుడి నిర్మాణం చేపట్టారు. దీంతో ప్రాచీణ కళ ఆలయ పరిసర ప్రాంతాల్లో వెల్లివిరుస్తోంది.
43 వేల టన్నుల గ్రానైట్ రాళ్లు
ఈ ఆలయ నిర్మాణానికి 43 వేల టన్నుల గ్రానైట్ రాయి (బ్లాక్ పెరల్)ని వాడారు. కోటప్పకొండలోని వీరభద్ర క్వారీ నుంచి 100 లారీలకు పైగా 43 వేల టన్నుల గ్రానైట్ రాయిని తీసుకొచ్చి నిర్మాణానికి ఉపయోగించారు. తమిళనాడుకు చెందిన ముత్తుకుమార్ నేతృత్వంలో ఆలయ నిర్మాణం జరిగింది. చదరపు అడుగు రూ. 400 రేటు పడగా, మొత్తం రూ.3.50 కోట్లు గ్రానైట్ రాళ్లకు ఖర్చు చేశారు.
విగ్రహ ప్రతిష్ఠకు హాజరైన మాజీ సీఎం
ఈ నందీశ్వరాలయ నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహకారం అందించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వారు దాదాపు 1.40 కోట్ల రూపాయలను ఆలయ నిర్మాణానికి అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వాహకులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 25వ తేదీన ఇక్కడ నిర్వహించిన యజ్ఞంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు భక్తజన సందోహం మధ్య పాల్గొన్నారు. విశేష పూజలు నిర్వహించారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
ప్రతిష్ఠ చేసిన కంచి కామకోటి పీఠాధిపతి
విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన 70వ కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్‌రెడ్డి నిర్వహించారు.
మండల పూజకు సర్వం సిద్ధం
ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగి నేటికి (ఆదివారం) 48 రోజులు అనగా మండలం పూర్తి కావడంతో అందుకు సంబంఽధించిన పూజలకు సర్వం సిద్ధం చేశారు. కొత్తగా శంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజాధికాలు పక్కన తాత్కాలికంగా నిర్మించిన యజ్ఞశాలలో నిర్వహించనున్నారు. ఇంకా యాగశాల, పార్కు, కల్యాణ మండపం, రెయిలింగ్ తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.


