● రూ.17.70 లక్షలు అవినీతి జరిగినట్లు ప్రజావేదికలో వెల్లడి
● ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్‌పై క్రమశిక్షణ చర్యలు
గాలివీడు: మండలంలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రూ.17.70 లక్షల నిధులను ఉపాధి హామీ సిబ్బంది పక్కదారి పట్టించినట్లు ఆడిట్ టీమ్ నిర్ధారించింది.స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం డ్వామా పీడీ వెంకటరత్నం అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృదం 17 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు జరిగిన పనులకు సంబంధించి జరిగిన అక్రమాలను ప్రజావేదికలో వెల్లడించింది. గ్రామాల వారిగా అరవీడు (రూ.56857), గోరాన్ చెరువు (రూ.195507), గరుగుపల్లి (రూ.95503), తలముడిపి(రూ.68743), తూముకుంట(రూ.46420), పూలింకుంట(రూ.226450), గుండ్లచెరువు(రూ.458891), నూలివీడు(రూ.3902), గాలివీడు (రూ.1000),పేరంపల్లి (రూ.9229), కొర్లకుంట(రూ.186956), సీసీ పల్లె(రూ.34844), గోపనపల్లె (రూ.6077),పందికుంట (రూ.254188), బొరెడ్డిగారిపల్లి (రూ.112840), ఎగువగొట్టివీడు(రూ.12051)అవినీతి జరిగినట్లు నిర్ధారించారు.ప్రధానంగా కూలీల సంతకాల్లో వ్యత్యాసాలు ,పనుల కొలతల్లో తేడాలు బయటపడ్డాయి. నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా చెల్లింపులు జరిపారు. ఉపాధి హామీ పథకంలో రూ.17,29,774 అవినీతి జరగ్గా, పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో 40,289 అవినీతి జరిగినట్లుగా నిర్ధారించారు. మొత్తం రూ.17,70,063 కాగా అందులో రూ.55,000 రికవరీ జరిగిందన్నారు.ఈ వ్యవహారంలో టెక్నికల్ అసిస్టెంట్లు రత్నకుమార్, ఖాదర్ భాషా, కంప్యూటర్ ఆపరేటర్ మణి కుమార్ పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఏపీడీ మధుబాబు, ఎస్‌ఆర్పీ సూర్య తదితరులు పాల్గొన్నారు.


