ఆవేదన.. ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆవేదన.. ఆందోళన

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

●శాంతిభద్రతలు క్షీణించాయి : అంజద్‌బాషా

ఓ వైపు బిడ్డ చనిపోయిందన్న ఆవేదన.. మరోవైపు కిరాతకుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని ఆందోళన వెరసి ఖాజీపేట ఉద్రిక్తంగా మారింది. తమకు కడుపుకోత మిగిల్చిన ఉన్మాదిని ఉరితీసేవరకు

తమ శోకం తీరదంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఆందోళన చేస్తున్న మహిళలకు సర్దిచెబుతున్న పోలీసులు

ఖాజీపేట బస్టాండ్‌ వద్ద ధర్నా చేస్తున్న స్థానికులు

ఖాజీపేట : ప్రేమోన్మాదిని ఎన్‌కౌంటర్‌ చేయాలని.. బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని రామకీర్తన కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం నిరసనకు దిగారు. అంత్యక్రియలు చేసేది లేదంటూ ధర్నా చేపట్టారు. వివరాలు.. ఖాజీపేట మేజర్‌ పంచాయతీలోని అగ్రహారం గ్రామంలో రామకీర్తన (16) అనే బాలికను ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్‌ శుక్రవారం ఉదయం ఇంటిలోనే అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. ఈ కేసు విషయంలో బాలిక తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం శవ పరీక్షలు పూర్తి చేసి రామకీర్తన మృతదేహాన్ని స్వగ్రామం అగ్రహారానికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకొచ్చారు. అయితే అంత్యక్రియలు చేస్తే తమ కుమార్తెకు న్యాయం జరగదని రామకీర్తన తల్లిదండ్రులు, బంధువులు భావించారు. అందరూ ఖాజీపేట బస్టాండ్‌ కూడలికి చేరుకుని ధర్నాకు దిగారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకూ ధర్నా చేశారు. మైదుకూరు డీఎస్సీ వెంకటేశ్వర్లు, కడప దిశా డీఎస్పీ బాలస్వామిరెడ్డి బాలిక బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నిందితుడికి చట్టప్రకారం శిక్షపడేలా చేస్తాం.. ఇందులో ఎవరి భాగస్వామ్యం ఉన్నా వదిలేది లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే హత్య చేసిన వ్యక్తితోపాటు ఇందులో ఇతరులు కూడా ఉన్నారని, వారి పేర్లు కూడా కేసులో నమోదు చేయాలని బాలిక బంధువులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు తిరిగి ఫిర్యాదు తీసుకుని పేర్లు నమోదు చేసేందుకు హామీ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన హామీ మేరకు ధర్నా విరమించారు.

భారీ పోలీసు బందోబస్తు

శుక్రవారం జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అగ్రహారంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టారు. రామకీర్తన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని బంధువులు తెలిపారు.

బాలిక తల్లిదండ్రులకు పరామర్శ

అతి కిరాతకంగా హత్యకు గురైన రామకీర్తనకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. మృతి విషయం తెలుసుకుని బాలికకు నివాళి అర్పించారు. తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హంతకుడికి ఊరిశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రేమోన్మాదిని ఎన్‌కౌంటర్‌ చేయాలి

అప్పుడే బాలికకు న్యాయం జరుగుతుంది

బాలిక బంధువుల ధర్నా

నేడు అంత్యక్రియలు

కడప కార్పొరేషన్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థ మొద్దు నిద్ర పోతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖాజీపేటలో బాలికను పాశవికంగా హత్య చేయడం దారుణమన్నారు. ఆడపిల్లలు బయటికి వెళ్తే సురక్షితంగా ఇంటికి వస్తారా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. కూటమి సర్కార్‌ వచ్చాక ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్‌ మార్చేసిందని, డ్రగ్స్‌, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. దీనివల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. మొన్న ఆలంఖాన్‌పల్లెలో దస్తగిరిని హత్య చేశారని, దీనిపై లోతైన విచారణ జరపాలన్నారు. ఈ హత్యల వెనుక ఉన్న వారిని వెలికి తీసి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement