మదనపల్లె, ఏప్రిల్: శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ (జేసీ) మధుసూదనరావు ఆకాంక్షించారు. గురువారం మదనపల్లెలో దేవదాయ, పర్యాటక, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రగతి పథంలో జిల్లా
ఈ సందర్భంగా ఇంచార్జ్ జేసీ మాట్లాడుతూ, నూతన ఏడాదిలో వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం, పశుసంపదతో పల్లెలు కళకళలాడాలని కోరారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ నాయకత్వంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, తెలుగువారికి ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకమైనదని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పంచాంగ శ్రవణం – కవి సమ్మేళనం:
అర్చకులు బాలాజీ స్వామి, విశ్వేశ్వర స్వామి బృందం పంచాంగ శ్రవణం చేస్తూ.. ఈ ఏడాది క్షేమం, ఆరోగ్యం, సస్యసమృద్ధి కలుగుతాయని తెలిపారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో తెలుగు భాషా గొప్పదనాన్ని కవులు కొనియాడారు. డాక్టర్ వేంపల్లి అబ్దల్ ఖాదర్, హసీనా బేగం, ఎస్.స్రవంతి, గాయత్రీదేవి తమ వచన కవితలతో అలరించగా, జలకనూరి మురళధర్ రాజు పద్య పఠనం చేశారు. వీరిని జేసీ ఘనంగా సత్కరించారు.
సాంస్కృతిక ప్రదర్శనలు:
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో లావణ్య నాట్య గురుకులం, శ్రీ వేద సంగీత నిత్యాలయం, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, సేవా భారతి బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ముగ్ధులను చేశాయి. తెలుగు సంస్కృతిని చాటిచెప్పేలా సాగిన ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలను అందజేశారు.
అర్చకులకు పురస్కారాల ప్రదానం:
సనాతన ధర్మానికి విశేష సేవలు అందించిన జిల్లాకు చెందిన నలుగురు అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలను అందజేశారు. కే. రామాచార్యులు, పి. కృష్ణమాచార్యులు, డి. శివ శంకరాచార్యులు, పి. రెడ్డిస్వామిలను తలా రూ. 10,116 నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం, పంచాంగం, శాలువాతో జేసీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జిల్లా అధికారి విశ్వనాధ్, పర్యాటక అధికారి నాగభూషణం, డీఈఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, హార్టికల్చర్ అధికారి సుభాషిణి, రెవెన్యూ సిబ్బంది మరియు ఆలయ ఈవోలు పాల్గొన్నారు.
మదనపల్లె లో పంచాగ శ్రవణం చేస్తున్న పండితులు, మదనపల్లెలో ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్న ఇన్చార్జి జేసీ మధుసూదనరావు
జిల్లా సుభిక్షంగా ఉండాలని జేసీ ఆకాంక్ష
ఘనంగా పంచాంగ పఠనం,
కవి సమ్మేళనం
అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వ
ఉగాది పురస్కారాల ప్రదానం


