అన్నీ ప్రశ్నలే?
● టమోటా మార్కెట్‌లో
ధరల మాయాజాలం!
● ములకలచెరువులో
రైతుల నిలువునా మోసం
మదనపల్లె: అన్నమయ్య జిల్లాలోని టమోటా మార్కెట్ యార్డుల్లో, ముఖ్యంగా ములకలచెరువులో ధరల వెనుక పెద్ద మాయాజాలం సాగుతోంది. మార్కెటింగ్ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారులు, దళారులు ఆడుతున్న నాటకంలో సామాన్య రైతు బలైపోతున్నాడు. గరిష్ట ధర పేరుతో సాగుతున్న ప్రచారం వెనుక వాస్తవాలు పరిశీలిస్తే రైతులకు ఒరుగుతున్న లాభం శూన్యమని స్పష్టమవుతోంది.
రికార్డు ధర.. కేవలం ప్రచారానికే!
ఈ నెల 15న ములకలచెరువు మార్కెట్‌లో కిలో టమోటా రూ. 17 పలికినట్లు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు. పొరుగున ఉన్న మదనపల్లె (రూ.13.50), వాయల్పాడు (రూ.13.60), పుంగనూరు (రూ.11), వి.కోట (రూ.10) కంటే ఇక్కడ ఎక్కువ ధర ఉందంటూ ఊదరగొట్టారు. అయితే, వాస్తవానికి ఈ ధర కేవలం 10 శాతం పంటకు మాత్రమే దక్కింది. మిగిలిన 90 శాతం పంటను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతులను ముంచేశారు. 15 కిలోల క్రేట్ల విధానం అమలు కావడం లేదన్న విమర్శల నుంచి రైతుల దృష్టి మళ్లించడానికే ఈ ‘ధరల అస్త్రాన్ని’ ప్రయోగించినట్లు తెలుస్తోంది.
కాగితాలకే పరిమితమైన ప్రభుత్వ ఆదేశాలు
రైతులు మోసపోకూడదనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ గతేడాది డిసెంబర్ 29న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.
15 కిలోల క్రేట్ విధానం:
25 కిలోల క్రేట్ల స్థానంలో నిర్వహణ సులభంగా ఉండే 15 కిలోల క్రేట్లను ప్రవేశపెట్టాలి.
జాక్‌పాట్ దోపిడీకి చెక్:
అమ్మకాల సమయంలో ‘జాక్‌పాట్’ లేదా ఇతర పేర్లతో అనధికారికంగా డబ్బులు తగ్గించకూడదు.
నిబంధనలు ఇవే:
క్రేట్ ఎత్తు వరకు మాత్రమే టమాటాలు నింపాలి. ఐదు అంతస్తుల కంటే ఎక్కువ పేర్చకూడదు. ధరల ప్రదర్శన కోసం ఎలక్ట్రానిక్ బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ, ములకలచెరువులో ఇవేవీ అమలు కావడం లేదు. బాక్సుల సైజు పెద్దవిగా ఉంచి, తక్కువ ధరకే ఎక్కువ పరిమాణంలో టమోటాలను వ్యాపారులు దోచుకుంటున్నారు.
‘ములకలచెరువు వద్దు బ్రో..’
ఇక్కడి మోసాలపై రైతులు సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. ‘ములకలచెరువు చాలా మోసం బ్రో..’ బాక్స్ లెవల్ అంటారు కానీ బాక్సులు చాలా పెద్దగా ఉంటాయి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికంటే కర్ణాటకలోని కోలార్, స్థానిక వడ్డిపల్లి, మదనపల్లె మార్కెట్లే నయమని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
15వ తేదీ ఒకరోజు కిలో ధర రూ.17 పలికింది. ఆ తర్వాత ఎందుకు పలకలేదు, మిగతా మార్కెట్లలో పలుకుతున్న ధర ఇక్కడ ఎందుకు పలకడం లేదు. ఒకరోజు మాత్రమే ఎందుకు ధర పెరిగింది?. 15 బా క్సుల విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తే.. ఆ ఒక్క విషయాన్ని విస్మరించిన మార్కెటింగ్ అధికారులు ఇతర అంశాలపై ఎందుకు దృష్టి పెడుతున్నారు, దీనికి కారణం ఏమిటి? అన్న అంశాలపై ఉన్నతాధికారులు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రశ్నార్థకంగా మారింది.


