పీపీపీ.. వద్దే వద్దు
2025–26 బడ్జెట్‌కు ఆమోదం
కడప కార్పొరేషన్: పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్(పీపీపీ) విధానం వద్దే వద్దంటూ కడప నగరపాలక వర్గం ఏకగ్రీవంగా తీర్మాణించింది. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో మేయర్ పాకా సురేష్ కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. ఎజెండాలో మొత్తం 65 అంశాలను పొందుపరచగా, వాటిలో కొన్నింటిని తిరస్కరించారు. నగరంలోని వైఎస్సార్ ఆడిటోరియం, నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయాలను పీపీపీ పద్దతిలో అప్పగించి అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను నిర్ద్వందంగా తోసిపుచ్చారు.
● 30వ డివిజన్ కార్పొరేటర్ షఫీ మాట్లాడుతూ పీపీపీ అంశాన్ని ఎవరు ఎజెండాలో చేర్చారో చెప్పాలని పట్టుబట్టారు. పీపీపీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కమిషనర్ మనోజ్‌రెడ్డి సమాధానమిస్తూ వీటి నుంచి కార్పొరేషన్‌కు ఆదాయం రావడం లేదని, పైగా అవి పాడుబడిపోతున్నాయని అందుకే చేర్చామని తెలిపారు.
● చిన్నచౌకు గ్రామ పరిధిలో 95 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో 20 మెగావాట్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్టును పీపీపీ, రెస్కో మోడల్ ద్వారా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనపై కార్పొరేటర్ చంద్రహాస రెడ్డి మాట్లాడుతూ గతంలో ఒక సోలార్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామని, దాన్ని తీసివేసి దీన్ని ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. పీపీపీ పద్దతిని వ్యతిరేకిస్తున్నానని మరో కార్పొరేటర్ మల్లికార్జున అన్నారు. దీనిపై ఎస్‌ఈ చెన్నకేశవరెడ్డి సమాధానమిస్తూ గతంలో అమోదం తెలిపిన ప్రాజెక్టు ద్వారా కార్పొరేషన్‌కు ఒనగూరే ప్రయోజనాలను పొందుపరచలేదని, ప్రస్తుత ప్రాజెక్టు వల్ల ఏడాదికి రూ.29.45లక్షల లీజు, ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా ఏడాదికి 90లక్షల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో మేయర్ మట్లాడుతూ దీనిపై ఒక కమిటీ వేసి వారు ఇచ్చే నివేధిక అధారంగా బీఓటీ పద్దతిలో ప్రాజెక్టు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
● నగరంలోని మున్సిపల్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కార్పొరేటర్లు ఎస్‌ఏ షంషీర్, సుజాత కోరారు. మాచుపల్లి బస్టాండు, ఆర్ట్స్ కాలేజీ, 47వ డివిజన్‌లోని కొన్ని స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, కంచె వేసి వాటిని కాపాడాలని కోరారు. ఎర్రముక్కపల్లె వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సుజాత కోరారు. వీఎల్‌టీ ఉంటేనే ఖాళీ స్థలాలను రిజిస్టర్ చేసేలా రిజిస్ట్రార్‌కు లేఖ రాయాలని కార్పొటర్ బాలస్వామిరెడ్డి కోరారు.
● రెండో గాంధీ బొమ్మ దగ్గర రోడ్డు విస్తరణ కాకుండా 9 మంది కోర్టును ఆశ్రయించారని, 2023లో రూ.1.20 కోట్లు పరిహారం చెల్లించేందుకు అధికారులు సమ్మతించారు. దాన్ని జనరల్ ఫండ్ నుంచి చెల్లించి రోడ్డు విస్తరణ చేపట్టాలని 31వ డివిజన్ కార్పొరేటర్ అజ్మతుల్లాఖాన్ కోరారు. రెండో గాంధీ బొమ్మ వద్దనేగాక రాజారెడ్డి వీధి, ఎర్రముక్కపల్లె, అప్సర కూడలిలో కూడా విస్తరణ చేసి నష్ట పరిహారం చెల్లించాలని కార్పొరేటర్ మగ్బూల్‌బాషా సూచించారు.
● ప్లానింగ్ సెక్రటరీలు, ఎల్‌టీపీలు కుమ్మకై ్క బీపీఎస్ అని గుర్తించిన భవన నిర్మాణ దారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని 9వ డివిజన్ కార్పొరేటర్ గంగాదేవి ఆరోపించారు. ఎవరు చేశారో వివరాలు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మనోజ్‌రెడ్డి సమాధానమిచ్చారు. రంజాన్ మాసంలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా, మసీదుల వద్ద పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టాలని కార్పొరేటర్లు అరీఫుల్లా బాషా, షఫీ కోరారు.
● డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మాట్లాడుతూ విశ్వనాథపురం రోడ్డు, మామిళ్లపల్లె మెయిన్ రోడ్లు 60 అడుగులు విస్తరించాలని ప్రతిపాదించారని, 40 అడుగులు చేస్తే సరిపోతుందని తెలిపారు.
మాట్లాడుతున్న
కార్పొరేటర్ మగ్బూల్‌బాషా
కమిషనర్
మనోజ్‌రెడ్డి
2024–25 సంవత్సరం సవరించిన బడ్జెట్, 2025–26 బడ్జెట్ అంచనాలను సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. రూ.514.84కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. రూ.447.65కోట్లు ఆదాయం, రూ.447.28 కోట్లు ఖర్చుగాను చూపారు. 65 శాతం బడ్జెట్ తగ్గిపోయిందని కార్పొరేటర్ మగ్బూల్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. క్యాపిటల్ అకౌంట్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులు, కుడా నిధులు తప్పా మరేవీ రాలేదన్నారు.
నగరపాలకవర్గం ఏకగ్రీవ తీర్మాణం
కొత్త మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రతిపాదన
ఆర్థిక సంక్షోభం నుంచి గట్ట్టెక్కేందుకు నిధులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి
హాజరు కాని ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిప్రజా సమస్యలపై సమగ్ర చర్చ
పీపీపీ.. వద్దే వద్దు
పీపీపీ.. వద్దే వద్దు


