తప్పులతడకగా పాసు పుస్తకాలు | - | Sakshi
Sakshi News home page

తప్పులతడకగా పాసు పుస్తకాలు

Jan 3 2026 7:04 AM | Updated on Jan 3 2026 7:04 AM

తప్పు

తప్పులతడకగా పాసు పుస్తకాలు

ఆధిపత్యం కోసం టీడీపీ నాయకుల ఘర్షణ

ఆధార్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లలో పొరపాటు

అత్యధిక భూములు జాయింట్‌గా ఉన్నట్లు నమోదు

బ్రాహ్మణఒడ్డుపల్లి గ్రామ సభలోరైతుల నిరసన

కురబలకోట: చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా రాజముద్ర అంటూ.. పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసు పుస్తకాల పట్ల రైతులు తీవ్ర విముఖత చూపుతున్నారు. రీ సర్వేలో తప్పుల తడకగా భూ వివరాలు నమోదు కావడంతో రైతాంగం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. శుక్రవారం మండలంలో తొలిసారిగా అంగళ్లు గ్రామంలోని బ్రాహ్మణ ఒడ్డుపల్లిలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ గ్రామ సభ నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ పోరెడ్డి విశ్వారెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో తహసీల్దారు ధనుంజయులు, ఆర్‌ఐ శేషాద్రి రావు, మండల సర్వేయర్‌ భువనేశ్వరి, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు రాజముద్రతో పంపిణీ చేసిన పాసు పుస్తకాల్లో భూ వివరాలు చూసి రైతులు ఒక్కసారిగా నోళ్లు వెళ్లబెట్టారు. పైలెట్‌ ప్రాజెక్టుగా 190 మంది రైతులకు చెందిన 240 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన తొలి రీ సర్వేలోనే తారుమారైన భూ వివరాలు చూసి అవాక్కయ్యారు. ఆస్తి పంపకాలు జరిగి ఏళ్లుగా వేర్వేరుగా భూములు సాగు చేసుకుంటున్నా.. జాయింట్‌గా ఉన్నట్లు అత్యధిక పాసు పుస్తకాల్లో నమోదు కావడంతో రైతులు నెత్తిన చేతులు పెట్టుకున్నారు. ఈ పాసు పుస్తకాలు ఉన్నా, లేనట్లేనని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రీ సర్వేలో భూ వివరాలు నమోదు సక్రమంగా లేవని అస్తవ్యస్తంగా ఉన్నాయని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీలో కొలతల్లో పొరపాట్లు, సరిహద్దులు కూడా స్పష్టంగా గుర్తించలేదని చెబుతున్నారు. ఆధార్‌ నంబర్లు, ఫోన్‌ నంబర్లు కూడా తప్పుగా నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల అన్నదాత సుఖీ భవ పథకం నిధులు కూడా జమ కాలేదని వాపోయారు. సర్వే నంబర్లతో సహా రీ సర్వేలో తీవ్రమైన తప్పిదాలు చోటుచేసుకున్నాయన్నారు. ఇన్నాళ్లు రీ సర్వే చేసి పల్లెలు తిరిగి సిస్టమ్‌ల ముందర గంటల తరబడి కూర్చొని ఒరగబెట్టింది ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. రీ సర్వే వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మా భూముల విషయంలో మాకే మనశ్శాంతి లేకుండా చేశారని మండిపడుతున్నారు. రీ సర్వేపై నమ్మకం పోయిందని.. ఇలాంటి పనికిరాని పాసు పుస్తకాలను పెట్టుకుని ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. రీ సర్వే నిర్వహిస్తున్న గ్రామాల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే నిలువునా ముంచేస్తారని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. రాజముద్ర ఉన్నా తప్పుల తడకగా ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలతో రైతులకు ఏమి ప్రయోజనమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బ్రాహ్మణ ఒడ్డుపల్లి గ్రామ సభలో పాల్గొన్న రైతులు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న తహసీల్దారు ధనుంజయులు

న్యాయం చేయకపోతే తిరుగుబాటు తప్పదు

రీ సర్వేలో తప్పుల తడకగా నమోదైన భూ వివరాలను సరిచేయాలి. రైతులకు ఆస్తి భూమే. బ్రాహ్మణఒడ్డుపల్లిలో ఎక్కువ మంది రైతుల భూములు జాయింట్‌ ఎల్‌పీఎం అని నమోదు కావడం విచారకరం. ఈ పాసు పుస్తకాల వల్ల బ్యాంకులలో పంట రుణాలు ఇవ్వరు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి అస్తవ్యస్తంగా ఉన్న భూ వివరాలను సక్రమంగా నమోదు చేయాలి. లేదంటే రైతుల నుంచి తిరుగుబాటు తప్పదు.

–పోరెడ్డి విశ్వారెడ్డి, అంగళ్లు గ్రామ సర్పంచ్‌, కురబలకోట

జాయింట్‌ భూముల విభజనకు అవకాశం

రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలలో జాయింట్‌ ఎల్‌పీఎంగా నమోదు అయిన వాటిని స్ప్లిటింగ్‌ (విభజన) ఆప్షన్‌ ద్వారా సరిచేసుకోవచ్చు. రైతులు ఆందోన చెందవలసిన అవసరం లేదు. గ్రామంలో 75 ఖాతాలు జాయింట్‌ గా నమోదయ్యాయి. సంబంధిత రైతులు కలసి వచ్చి వీటిని విభజన చేసుకోవచ్చు. భూ హెచ్చుతగ్గులను తప్పులను సరిచేసుకోవచ్చు. ప్రత్యేక శ్రద్ద వహించి వీటిని సరిచేయడం జరుగుతుంది. –ధనుంజయులు, తహసీల్దారు, కురబలకోట

పెద్దమండ్యం: పెద్దమండ్యం మండలంలోని శివపురం గ్రామంలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో రభస చోటుచేసుకుంది. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన గ్రామసభ వేదికగా.. టీడీపీ నాయకులు ఆధిపత్యం కోసం ఘర్షణ పడ్టారు. మండలంలో తేదేపా నాయకులు రెండు వర్గాలుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక వర్గం మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయులు కాగా, పార్టీ ఇన్‌చార్జిగా ఉండి సస్పెన్షన్‌కు గురైన జయచంద్రారెడ్డి వర్గీయులు మరొక వర్గంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శివపురంలో జరుగుతున్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వేదికపైన ఇరు వర్గాలకు చెందిన వారు కూర్చున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే శివపురం గ్రామ కమిటీ అధ్యక్షుడిని విమర్శిస్తూ ఇటీవల సోషల్‌ మీడియాలో తేదేపా నాయకుడు ఒకరు పోస్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయమై సదరు నాయకుడిని తేదేపా యూనిట్‌ ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తి ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలై చివరికి ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తనపైన, తన కుమారుడిపైన దాడి చేసి గాయ పరిచారని శివపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తప్పులతడకగా పాసు పుస్తకాలు 1
1/4

తప్పులతడకగా పాసు పుస్తకాలు

తప్పులతడకగా పాసు పుస్తకాలు 2
2/4

తప్పులతడకగా పాసు పుస్తకాలు

తప్పులతడకగా పాసు పుస్తకాలు 3
3/4

తప్పులతడకగా పాసు పుస్తకాలు

తప్పులతడకగా పాసు పుస్తకాలు 4
4/4

తప్పులతడకగా పాసు పుస్తకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement