సాంకేతికతతో భూ వివాదాలకు చెక్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె: నూతన పట్టాదారు పాస్ పుస్తకాలతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆధునిక సాంకేతికత వినియోగంతో భూ వివాదాలకు చెక్ పెట్టవచ్చని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటయ్యిక అంకిశెట్టిపల్లిలో మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమమని అన్నారు. మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో భూ సమస్యలు అధికమని, ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో అధునాతన సాంకేతికత ద్వారా భూ సమస్యలకు, వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సాంకేతికతతో సెంటీమీటర్ కూడా తేడా లేకుండా రీ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతుకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ఉంది తదితర అంశాలను స్పష్టంగా, సులభంగా గుర్తించవచ్చన్నారు. జిల్లా ఏర్పాటు అనంతరం భూ సమస్యపైనే మొదటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, ఇది భూ సమస్యల పరిష్కారానికి నాందిగా భావిస్తున్నట్టు చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా జిల్లా యంత్రాంగం పని చేస్తుందన్నారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లితే వాటిని అర్జీ పెట్టుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మార్కెట్ చైర్మన్ శివరాం, అధికారులు మాట్లాడారు. అనంతరం రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
సాంకేతికతతో భూ వివాదాలకు చెక్


