వినియోగదారులకు మెరుగైన సేవలు
రాయచోటి : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు నిరంతరం చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు సూచించారు. బుధవారం రాయచోటి డైట్ కళాశాలలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌ఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాలపట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వై.సుమతి మాట్లాడుతూ తూకాల్లో మోసం జరిగినా, నాణ్యతలేని వస్తువులు విక్రయించినా, రైల్వే, విమానయానం, విద్యుత్, గ్యాస్, కొరియర్ సేవలు, ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ వ్యాపారాల్లో లోపాలు, ఎదురైన సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే వినియోగదారుల హక్కులు, కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో వినియోగదారుల ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ఆంగ్ల, తెలుగు మీడియం వారిగా ప్రథమ బహుమతికి రూ. 5 వేలు, ద్వితీయ బహుమతికి రూ. 3 వేలు, తృతీయ బహుమతికి రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ. 40 వేలు, ప్రశంసా పత్రాలు, మెడల్స్ విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారి శోభలత, జిల్లా తూనికల కొలతల ఇన్‌స్పెక్టర్ దివ్య, జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి షమీం బాషా, రాయచోటి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ షేక్ సుమయ, మదనపల్లి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ చిరంజీవి, జిల్లా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


