ముదివేడు రిజర్వాయర్‌ మీరే పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

ముదివేడు రిజర్వాయర్‌ మీరే పూర్తి చేయండి

Dec 25 2025 8:11 AM | Updated on Dec 25 2025 8:11 AM

ముదివేడు రిజర్వాయర్‌ మీరే పూర్తి చేయండి

ముదివేడు రిజర్వాయర్‌ మీరే పూర్తి చేయండి

ముదివేడు రిజర్వాయర్‌ మీరే పూర్తి చేయండి ● మదనపల్లె అభివృద్ధికి కృషి

బి.కొత్తకోట: కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది..మీరే ముదివేడు రిజర్వాయర్‌ పనులు చేపట్టి పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ లోక్‌ సభాపక్ష నేత, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పీవీ.మిథున్‌ రెడ్డి టీడీపీ నేతలను కోరారు. బుధవారం బి.కొత్తకోట ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి హజరైన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కురబలకోట మండలంలో రూ.755 కోట్లతో ముదివేడు రిజర్వాయర్‌ నిర్మాణం చేపడితే టీడీపీ నేతలు ఎన్జీటీలో అక్రమ కేసులువేసి పనులు నిలిపి వేయించారని అన్నారు. మీ చేతుల్లోనే ప్రభుత్వం ఉంది, అక్రమ కేసులతో పనులు ఆపివేయించింది మీరే, ఈ ప్రాజెక్టు కరువు రైతులకు ఎంత ఉపయోగకరమో ఇప్పటికై నా గుర్తించండి..మిగిలిన పనులను చేపట్టి పూర్తి చేయాలని టీడీపీ నేతలను కోరారు. మీ తప్పిదాన్ని మీరే సరి చేసుకోండి అని వారికి సూచించారు. తక్షణమే పనులు చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. దీనికోసం రైతుల పక్షాన తామే పరిహారం కోసం కోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు. పరిహారం విషయంలో రైతులకు న్యాయం చేయాలన్నారు. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ముదివేడు రిజర్వాయర్‌ పనులు ఆగిపోవడం వల్ల కరువు ప్రాంతమైన తంబళ్లపల్లె నియోజకవర్గానికి తీరన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువువస్తే నీటిని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రధాన కారణం నీటిని నిలువ చేసుకునే అవకాశం లేకపోవడమేనని అన్నారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పు కోసం తమ ప్రభుత్వంలో రూ.2129 కోట్లతో పనులు చేపడితే...చంద్రబాబు ప్రభుత్వం విస్తరణ పనులు ఆపి కాలువకు లైనింగ్‌ చేయించిందన్నారు. ఈ కాలువ ద్వారా చెరువులకు కృష్ణా జలాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. కాలువ నుంచి చెరువులకు నీటిని మళ్లించి చెరువులను నింపాలని కోరారు. కృష్ణా జలాలను తరలించి నిల్వ చేయడం వల్ల భవిష్యత్తులో కరువు పరిస్థితులు వస్తే ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు. అసలు తంబళ్లపల్లె ఆంధ్రాలో ఉన్నట్టుగా కూడా పాలకులు గుర్తించడం లేదని, ఇప్పటికై నా తంబళ్లపల్లె ఆంధ్రాలో ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కుప్పంపై చూపుతున్న శ్రద్ధ కరువు ప్రాంతమైన మారుమూల నియోజకవర్గం తంబళ్లపల్లైపెనా శ్రద్ధ చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతులకు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించాం

తంబళ్లపల్లె ఆంధ్రాలో ఉందని గుర్తించండి

కుప్పంపైనే కాదు ఇక్కడా శ్రద్ధ చూపండి

కృష్ణా జలాలతో చెరువులను నింపాలి

ఎంపీ పీవీ మిథున్‌ రెడ్డి

మదనపల్లె అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కృషి చేస్తున్నట్టు ఎంపీ మిథున్‌ రెడ్డి చెప్పారు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉన్నందున కదిరి రోడ్డు నుంచి బెంగళూరు రోడ్డుకు, అక్కడినుంచి పలమనేరు రోడ్డును కలిపేలా బైపాస్‌ రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రికి విన్నవించినట్టు చెప్పారు. మదనపల్లె, తంబళ్లపల్లె పేద విద్యార్థులకు నాణ్యమైన కేంద్రీయ విద్య అందించాలని లక్ష్యంతో మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కేంద్రమంత్రిని కోరినట్టు చెప్పారు. రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాలకు కీలకమైన కడప–బెంగళూరు రైల్వే మార్గం పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ రైలు మార్గంతో పార్లమెంట్‌ నియోజకవర్గానికి, బెంగళూరు మధ్య రాకపోకల సౌకర్యం పెరగడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు పెరిగి ఇక్కడి ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. అలాగే తమిళనాడు, ఏపీ మధ్య రాకపోకలకు సౌకర్యంగా ఉండే చైన్నె ప్యాసింజర్‌ రైలు సేవలను త్వరితగతిన ప్రారంభించాలని రైల్వే మంత్రికి విన్నవించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు రెడ్డిశేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాగొండ ఖలీల్‌, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాంబశివ, మండల పరిషత్‌ అధ్యక్షులు ఎన్‌.రాధ, మోహమూద్‌, పూర్ణచంద్రిక, శ్యామలమ్మ, జెడ్పీటీసీలు రామచంద్ర, శివన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement