మదనపల్లె/పీలేరు: మదనపల్లె–తిరుపతి జాతీయ రహదారిపై ఉన్న కలికిరి ఫ్లైఓవర్ వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు లేకపోవడంతో కలికిరి, మిగతా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజంపేట ఎంపీ, వైఎస్సార్‌సీపీ లోక్‌సభపక్షనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరిని మిథున్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రహదారి సమస్యపై వినతిపత్రాన్ని అందించిన మిథున్‌రెడ్డి ఇక్కడి ప్రజలు పడుతున్న రహదారి కష్టాలు, సమస్య పరిస్థితిని మంత్రికి వివరించారు. వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ సమస్యను మంత్రి సావధానంగా ఆలకించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని మిథున్‌రెడ్డికి హామీ ఇచ్చారు. కలికిరి పట్టణం సమీపంలో ఉన్న ఎన్‌న్‌హెచ్–71 ఫ్లైఓవర్ వద్ద తక్షణం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఏర్పాటు చేయాలని కోరారు. కలికిరిలో సుమారు 60 వేల జనాభా ఉండగా ఇటీవల నిర్మించిన 40 మీటర్ల వెడల్పు ఫ్లైఓవర్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ, ప్రధాన రహదారికి చేరుకునే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు లేకపోవడం సమస్యగా మారింది. ప్రస్తుతం సమీప ప్రవేశ మార్గం దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, స్థానిక ప్రజలు, బస్సులు, ఇతర వాహనాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాయని మిథున్‌రెడ్డి మంత్రికి తెలిపారు. ఈ పరిస్థితి కలికిరి పట్టణానికి సమీప గ్రామాల రవాణా సౌకర్యాలకు ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో సర్వీస్ రోడ్లకు యాక్సెస్ మార్గాలు కల్పించాల్సి ఉందని గుర్తుచేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ మిథున్‌రెడ్డి వినతి
తక్షణ చర్యలకు హామీ


