రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కూటమి ప్రభుత్వం
జిల్లాల విభజన సరికాదు
రాయచోటి అర్బన్: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కూటమి ప్రభుత్వమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించిన కూటమి నాయకులే ఇప్పుడు ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారని తెలిపారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.2.78లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రూ.3.26లక్షల కోట్లు ఆప్పులు చేస్తే, ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు, పపన్ కల్యాణ్‌లు ఏకంగా 10, 15లక్షల కోట్లు అప్పులు చేశారని దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏది చేసినా ప్రజలకు, రాష్ట్రానికి ఆస్తులు సమకూరాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పక్కా భవనాలు నిర్మించి, రాష్ట్రంలో ఏకంగా 12వేల సచివాలయాలు, పీహెచ్‌సీలు, ఆర్బీకేలు నిర్మించినట్లు తెలిపారు. ఆనాడే ఆదానీ గూగుల్ వస్తే దాన్ని గూగుల్‌గా పేరు మార్చి పబ్బం గడుపుతున్నారని తెలిపారు. జగన్ పాలనలో జరిగిన విషయాన్ని ఆర్‌బీఐ ఇచ్చిన నివేదికలో తయారీ రంగంలో దేశంలో 5వ స్థానం, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంతో పాటు, పరిశ్రమల విషయంలో దేశంలో 8వ స్థానం, దక్షణ భారత దేశంలో మొదటి స్థానంలో , ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో మొదటి స్థానంలో వరుసగా 5 ఏళ్ల ఉండటం జగన్ పాలనలో జరిగిన ఘనతే అనిన్నారు. ఈ అంశాలపై ఎక్కడైనా ఆధారాలతో సహా చర్చకు సిద్దమని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే కూటమి పాలకులు ఆవకాయ్ అమరావతి అంటూ ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఉపాధి హామీ పథకాన్ని
బ్రష్టు పట్టిస్తున్నా ప్రశ్నించని ప్రభుత్వం...
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కేంద్ర ప్రభుత్వం రామ్ జీ రామ్‌గా మార్చుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వామపక్షాలతో కలిసి ఒత్తిడి చేయడంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి పథకాన్ని తెచ్చారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దాదాపు రూ.2 లక్షల కోట్లు రాష్ట్రానికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. అయితే 12 ఏళ్ల మోదీ పాలనలో ఈ పథకానికి చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు పేరు మార్చి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నా కూటమి పాలకులు ప్రశ్నించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కాళ్లు ఇంచుతాం, కీళ్లు ఇంచుతామని సినిమా డైలాగులు చెబుతున్న జనసేన నాయకులు ఇటువంటి ప్రజలకు నష్టం జరిగే అంశాలపై భాగస్వామ్య పార్టీ అయిన కేంద్రంలో ఉన్న బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు , కొత్త పింఛన్లు ఇవ్వలేని స్థితిలో ఉంటే ఉపాధి పథకంలో 40శాతం వాటాగా నిధులు ఇచ్చే విధంగా తయారైన కొత్త నిబంధనలను ఈ పాలకులు ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన 26 జిల్లాలకు ఇటీవల ప్రెసిడెంటల్ అప్రూవల్ వచ్చిందని, ఈ ప్రతిపాదన గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్రానికి పంపినదేనని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సమయంలో కొత్తగా జిల్లాల విభజన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాను యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేశారు., కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహ్మాన్, పట్టణ అధ్యక్షుడు నవాజ్, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, షబ్బీర్ పాల్గొన్నారు.
18 నెలల పాలనలో రూ.2.78లక్షల కోట్లు అప్పు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి


