కలెక్టరేట్‌లో ఘనంగా క్రిస్మస్ హైటీ కార్యక్రమం
రాయచోటి : అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రిస్మస్ హైటీ కార్యక్రమం ప్రజలందరిలో సంతోషం, ఉత్సాహాన్ని కలిగించిందని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఘనంగా క్రిస్మస్ హైటీ కార్యక్రమం నిర్వహించారు. మత భేదాలు లేకుండా అందరికీ ఉత్సాహం, స్ఫూర్తిని అందించే పండుగ క్రిస్మస్ అని కలెక్టర్ అన్నారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, ఆనందం అనే సందేశాన్ని అందరికీ అందిస్తుందని, ఆ సందేశాన్ని సమాజంలోని చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిదీ అన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ క్యాండిల్ వెలిగించి, కేక్ కట్‌చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్‌చార్జి సుగవాసి ప్రసాద్‌బాబు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇనాయతుల్లా, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.


