టమాటా ధరల్లో కోతలు వేస్తున్నారు
● బిల్లుల కోసం నెలల తరబడి తిప్పుకుంటున్నారు
● ఇష్టానుసారంగా జాక్‌పాట్‌ల పేరుతో దోపిడీ
● రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు రైతుల ఫిర్యాదు
గుర్రంకొండ : రైతుల్ని దోచుకుంటున్న టమాటా వ్యాపారులపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ రైతుకు చెందిన టమాటాల ధరలను ఇష్టానుసారం కోతలు వేస్తూ రైతులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రైతులు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయసునీతకు ఫిర్యాదు చేశారు. బుధవారం స్థానిక మార్కెట్‌యార్డులో ఆమె పర్యటించారు. యార్డులోపల నిర్వహిస్తున్న టమాటా మండీలను పరిశీలించారు. టమాటా క్రీట్లు, వాటి ధరలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్‌యార్డుల్లోని టమాటా మండీలో జరుగుతున్న అన్యాయాలపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులు చేసిన రైతులను వ్యాపారులు వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఏ రైతులైతే ఫిర్యాదు చేస్తారో వారి టమాటా ధరలను వేలం పాటల్లో ఇష్టానుసారం కోతలు విధించి నష్టాలపాలు చేస్తున్నారని చెప్పారు. టమాటా కొనుగోలుకు సంబంధించిన బిల్లుల తాలుకు డబ్బులు చెల్లించడానికి టమాటా మండీల యజమానులు నెలల తరబడి తిప్పుకొంటున్నారని రైతులు ఆమెకు ఫిర్యాదు చేశారు. జాక్‌పాట్‌ల పేరుతో వందకు 10 నుంచి 15 క్రీట్ల టమాటాలను ఉచితంగా వ్యాపారులు రైతుల వద్ద నుంచి లాక్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగు శాతం కమీషన్ వసూలు చేయాల్సి ఉండగా పదిశాతం వసూలు చేయడంతో ఇతర మండీల ఖర్చులన్నీ రైతులపైనే మోపుతున్నారని వాపోయారు. అనంతరం ఆమె రైతుల నుద్దేశించి మాట్లాడుతూ.. మార్కెట్‌యార్డుల్లో నిర్వహించే టమాటా మండీల్లో జాక్‌పాట్‌లు రద్దు చేస్తున్నామని అన్నారు. ఎవరైనా వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించి జాక్‌పాట్‌లు వసూలు చేస్తే వారి లైసెన్స్‌లు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. మార్కెట్‌యార్డు పరిధిలోని బయట ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రైవేట్‌గా టమాటా మండీలు నిర్వహించకూడదన్నారు. ఇలా ఎవరైనా మండీలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. జనవరి నుంచి 25 కేజీల క్రీట్ల స్థానంలో 15 కేజీల టామాటా క్రీట్ల విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌శాాఖ జేడీ రామాంజనేయులు, ఏడీఎమ్ త్యాగరాజు, డీడీఎమ్ లావణ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోసూరి చంద్రమౌళి, వైస్ చైర్మన్ నౌషాద్‌ఆలీ, ఇన్‌చార్జి కార్యదర్శి సునీల్ పాల్గొన్నారు.
జాక్‌పాట్ రద్దుకు చర్యలు
మదనపల్లె రూరల్ : టమాటా మార్కెట్లలో జాక్‌పాట్ సిస్టం పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌శాఖ కమిషనర్ విజయసునీత తెలిపారు. బుధవారం మదనపల్లె పర్యటనలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించారు. మార్కెట్‌కమిటీ చైర్మన్ జంగాల శివరాంతో కలిసి మార్కెట్‌యార్డులో మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌శాఖ కమిషనర్ మాట్లాడుతూ.. మదనపల్లె మార్కెట్‌యార్డులో సౌకర్యాల లేమి కనిపిస్తోందన్నారు. టమాటా క్రయవిక్రయాలకు సంబంధించి పెద్దసంఖ్యలో రైతులు వచ్చే మార్కెట్‌యార్డులో క్యాంటీన్, రైతుల వసతి కేంద్రం, డ్రెయిన్లు, చైర్మన్ ఛాంబర్‌తో సహా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సి ఉందన్నారు. స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్‌యార్డు ఎదుట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మార్కెట్‌కమిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, ఇదివరకే దీనికి సంబంధించి ప్రతిపాదనలు అందాయని, త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. 25 కిలోల క్రేట్ల వినియోగంపై ఇటు రైతులు, అటు ట్రేడర్స్ పరంగా నష్టం వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ములకలచెరువు, గుర్రంకొండ, మదనపల్లె మార్కెట్లలో యూనిఫాం సిస్టంలో చిన్న క్రేట్లు వినియోగంలోకి తెస్తామన్నారు.


