రహదారుల పనులను వేగవంతం చేయాలి
రాయచోటి : రహదారుల పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయాణ ఖర్చు తగ్గేలా చూడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, నీటిపారుదల శాఖ, జాతీయ రహదారులు, డ్వామా తదితర ఇంజినీరింగ్ శాఖల పనుల పురోగతిపై జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, నాబార్డు తదితర నిధులతో చేపడుతున్న రహదారుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ తదితర ప్రాజెక్టులను కాలపరిమితితో పూర్తి చేయాలన్నారు. జల జీవన్ మిషన్ కార్యక్రంమలో 3079 పనులలో 2615 పనులు పూర్తి చేశారని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు క్రింద జిల్లాలోని 18 మండలాలలో 3075 ప్రాంతాలకు నీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాలలో చేపడుతున్న మొత్తం 75 పనులలో 30 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల పనులపై సమీక్షిస్తూ రాయచోటి నుంచి వేంపల్లి వరకు ఎన్‌హెచ్ 440 రహదారిపై పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా శాఖల డివిజన్ స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


