
పకడ్బందీగా లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు
రాయచోటి జగదాంబసెంటర్ : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంలో నిర్దేశించిన అంశాలను పకడ్బందీగా అమలు చేస్తూ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిషేధిత చట్టంలోని నిబంధనల మేరకు స్కాన్ సెంటర్లు లేదా డయాగ్నస్టిక్ సెంటర్లు లింగ నిర్ధారణ చేసినట్లయితే కఠినచర్యలు తప్పవన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ చట్టంపై అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పోలీసు అధికారులతో వైద్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌ఓ, శిశు సంక్షేమ శాఖ అధికారి, ఎన్‌జీఓలు, డీఎల్‌ఏసీ కమిటీ మెంబర్లు, ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి