
చవితి వేడుకలకు సర్వం సిద్ధం
● నేడు వినాయక చవితి
● జిల్లాలో 3800 విగ్రహాల ఏర్పాటుకు అనుమతి
● పూజా సామగ్రి కొనుగోళ్లతో
కిటకిటలాడిన మార్కెట్లు
● ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ముస్లిం నాయకులు
రాయచోటి : వినాయక చవితిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 9 గంటల నుంచే సందడి నెలకొంది. రోడ్లన్నీ గణపతిని తీసుకు వెళ్లే లారీలు, ట్రాక్టర్లు, ఉత్సాహం ఉరకలేస్తున్న యువకుల కేకలతో మార్మోగాయి. విగ్రహాలను విక్రయించే షెడ్ల వద్ద భక్తుల హడావుడి కనిపించింది. ఉత్సాహ వంతులైన యువకులు డబ్బుకు వెనుకాడక నచ్చిన విగ్రహాన్ని తీసుకెళ్లారు. పండుగనాడు ఉదయం శాస్త్రోక్తంగా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
ఏర్పాట్లు పూర్తి
అన్నమయ్య జిల్లాలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సరుకులు, పూలు, పండ్లు, పత్రి, చెరుకు గడలు, మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసేందుకు తరలివచ్చిన జనంతో జిల్లా పరిధిలోని రాయచోటి, మదనపల్లి, రాజంపేట, పీలేరు, కోడూర్, కొత్తకోట కేంద్రాలలోని మార్కెట్ ఆవరణాలు కిక్కిరిసిపోయాయి. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాల విక్రయ కేంద్రాలు కొనుగోలు దారులతో రద్దీగా మారాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉత్సవ కమిటీల నిర్వాహకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు కోలాహలంగా మారాయి. యువకులు ఉత్సాహంతో విగ్రహాల ఏర్పాట్లపై దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా ఉత్సవ కమిటీలుగా ఏర్పడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
చూడముచ్చటగా మండపాలు
వినాయక మండపాలను నిర్వాహకులు రంగురంగుల అలంకరణలు, విద్యుత్ దీపాల వెలుగులలో చూడముచ్చటైన నిర్మాణాలతో సెట్టింగులను వేసి సిద్ధం చేశారు. జిల్లా కేంద్రమైన రాయచోటి, మదనపల్లి, రాజంపేటతోపాటు జిల్లాలోని 30 మండలాల్లో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. మండపాలను అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం సాయంత్రం కల్లా వినాయక విగ్రహాలను పలు ప్రాంతాల నుంచి మండపాలకు చేరవేశారు. ఒకరికంటే ఒకరు భారీ విగ్రహాలు, వివిధ రూపాలతో ఉన్న గణనాథుని విగ్రహాలను నెలకొల్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పలు మండపాల నిర్వాహకులు లక్కీడ్రా ద్వారా ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు తదితర ఆకర్షణీయమైన బహుమతులతో లక్కీడ్రాలను చేపడుతున్నారు.
మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ
అన్నమయ్య జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల కేంద్రాలతోపాటు పల్లె ప్రాంతాల్లో సైతం ఈ ఏడాది భారీగా గణనాథుని ఉత్సవాల నిర్వహణకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల పరిధిలో 3800 విగ్రహాల ఏర్పాటుకు జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతులు ఇచ్చింది. జిల్లా పోలీస్ అధికారుల సూచనలు మేరకు విగ్రహాల ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు గడప గడపన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రత్యేక నిఘా
చవితి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు ఆయా మండపాల వద్ద బందోబస్తు చేపట్టనున్నారు. నవరాత్రులు పూజలందుకున్న అనంతరం వినాయక నిమజ్జనాలను చేపట్టనున్నారు.
మదనపల్లెలో పూజా సామగ్రి
కొనుగోలు చేస్తున్న భక్తులు
మదనపల్లెలో మట్టి విగ్రహాలు పంపిణీకి సిద్ధం చేసిన ముస్లిం నాయకుడు పఠాన్ ఖాదర్‌ఖాన్
విగ్రహాలను విక్రయ కేంద్రాల నుంచి మండపాలకు తరలిస్తున్న ఉత్సవ కమిటీల సభ్యులు
వెల్లివిరిసిన మత సామరస్యం
మదనపల్లె : వినాయక చవితి వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. కొందరు ముస్లింలు లంబోదరుడిపై భక్తితో.. ఉత్సవాల్లో పాలుపంచుకోవడం విశేషం. 11 ఏళ్లుగా మట్టి విగ్రహాలు ఉచితంగా అందిస్తున్న మదనపల్లెకు చెందిన హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్‌ఖాన్ 12వ ఏడాది కొనసాగించారు. మంగళవారం మదనపల్లెలోని తాజ్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖాదర్‌ఖాన్ 1,000 మందికి విగ్రహాలు పంపిణీ చేశారు. పూజకు అవసరమైన సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఖాదర్‌ఖాన్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో ఏ పండుగ జరిగినా కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకొంటూ.. మతసామరస్యానికి ప్రతీకగా నిలవాన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏటా చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి స్థానిక నేతలు, సంఘాల ప్రతినిధులు హాజరై ఖాదర్‌ఖాన్‌ను ప్రశంసించారు.
మదనపల్లెలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్‌సిద్దిక్ మట్టి వినాయకుని విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేశారు.

చవితి వేడుకలకు సర్వం సిద్ధం

చవితి వేడుకలకు సర్వం సిద్ధం