
మట్టి విగ్రహం.. పర్యావరణ హితం
రాయచోటి : పర్యావరణ హితం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కావున అందరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని పేర్కొన్నారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, రాయచోటి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాయచోటి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ సుధా, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, మున్సిపల్ కమిషనర్ జి.రవి, ఏఈఈ అనీల్‌కుమార్‌రెడ్డి, అనాలసిస్ట్ సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతియుతంగా జరుపుకోవాలి
రాయచోటి : వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆయన మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిష్ట వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఘనంగా వీరభద్రస్వామి జయంత్యుత్సవం
రాయచోటి టౌన్ : రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి జయంత్యుత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం స్వామివారి జయంతి సందర్భంగా మూలవిరాట్‌కు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి యాలివాహనంపై కొలువు దీర్చి, పుర వీధుల్లో ఊరేగించారు.

మట్టి విగ్రహం.. పర్యావరణ హితం

మట్టి విగ్రహం.. పర్యావరణ హితం